కర్ణాటక ఉడుపి పట్టణం(Udupi town)లోని మహిళా నర్సింగ్ కాలేజీ బాత్రూమ్లో తోటి విద్యార్థినుల ప్రైవేటు వీడియోలు చిత్రీకరిస్తున్నారన్న విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే. బాత్రూమ్లో వీడియో తీసిన మాట నిజమేనని నేత్రాజ్యోతి నర్సింగ్ కళాశాల (College of Nursing) డైరెక్టర్ రశ్మీ వెల్లడించారు.ముంబైలో నివాసం ఉంటున్న ఉడుపి వాసి, సమాజ సేవకురాలు రశ్మి సమంత్ ట్వీట్ చేసి మరో వర్గానికి చెందిన ముగ్గురు యువతులు వీడియో (Video) తీశారంటూ పెట్టిన పోస్టు సంచలనం కలిగించింది.దీంతో ముగ్గురు విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి ఉడుపి ఎస్పీ అక్షయ్ (SP Akshay) మశ్చింద్రను వివరణ కోరగా సోషల్ మీడియాలో మరో రకమైన వీడియో చూపించారని, అందులో వాయిస్ ఎడిట్ చేసి వైరల్ చేసినట్లు తెలిపారు.ముగ్గురు అమ్మాయిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఆయన తెలిపారు. మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు కాలేజ్ డైరెక్టర్ తెలిపారు.కొందరు మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారనే అభియోగాలనూ నమోదు చేశామన్నారు. ఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపింది. ఈ దారుణానికి పాల్పడిన అమ్మాయిలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు బీజేపీ (BJP) పిలుపునిచ్చింది.