»Eknath Shindes Latest Move In Legislative Council To Corner Team Uddhav Thackeray
Maharashtra Politics: ఉద్దవ్ థాకరేను మరింత కార్నర్ చేసిన షిండే
తాజాగా ఉద్దవ్ థాకరేను మరింత కార్నర్ చేసేందుకు షిండే సరికొత్త ఎత్తుగడను వేశారు. శాసన మండలిలో శివసేన చీఫ్ విప్ గా విప్లవ్ బజోరయాను గుర్తించాలని కౌన్సిల్ డిప్యూటీ ఛైర్ పర్సన్ నీలమ్ గోర్హేకు ముఖ్యమంత్రి షిండే లేఖ రాశారు.
మహారాష్ట్రలో (Maharashtra) ఉద్ధవ్ థాకరేకు (Uddhav Thackeray) దెబ్బ మీద దెబ్బ పడుతోంది. తన తండ్రి బాల్ థాకరే (bal thackeray) ఆశయాలకు, లక్ష్యాలకు దూరం జరిగి, కాంగ్రెస్ (Congress) వంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జీర్ణించుకోలేని శివసేన (Shiv Sena) పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు… ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలో ఒక్కటై.. తమదే అసలైన శివసేన పార్టీ (Shiv Sena Party) అని చెబుతూ వస్తున్నారు. అంతేకాదు, ఇటీవలె కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) కూడా షిండే వర్గానిదే అసలైన శివసేన పార్టీగా గుర్తించడంతో పాటు విల్లు, బాణం గుర్తు ఈ వర్గానికి కేటాయించింది. ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ అంశంపై ఉద్దవ్ థాకరే వర్గం కోర్టుకు వెళ్లినప్పటికీ, అక్కడ అంతకుముందే షాక్ తగిలింది. తాజాగా మరో ఝలక్ ఇచ్చారు షిండే. తద్వారా మహా రాజకీయాల్లో ఉద్ధవ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
తాజాగా ఉద్దవ్ థాకరేను మరింత కార్నర్ చేసేందుకు షిండే సరికొత్త ఎత్తుగడను వేశారు. శాసన మండలిలో శివసేన చీఫ్ విప్ గా విప్లవ్ బజోరయాను గుర్తించాలని కౌన్సిల్ డిప్యూటీ ఛైర్ పర్సన్ నీలమ్ గోర్హేకు ముఖ్యమంత్రి షిండే లేఖ రాశారు. ప్రస్తుతం శివసేన చీఫ్ విప్ గా ఉద్దవ్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ అనిల్ పరబ్ ఉన్నారు. షిండే వర్గానికి శాసన మండలిలో ఎక్కువ బలం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సరికొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి.
శివసేన అసెంబ్లీ చీఫ్ విప్ భరత్ గోగావాలే మాట్లాడుతూ… బడ్జెట్ సెషన్ ప్రారంభమైన నేపథ్యంలో అందరు శివసేన ఎమ్మెల్యేలు కూడా సమావేశాలకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. సమావేశాలకు ఎవరైనా హాజరు కాకుంటే వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు. మరోవైపు, శివసేనలోని షిండే వర్గం, ఉద్దవ్ థాకరే వర్గం మధ్య వాగ్యుద్ధం నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ గతవారం మాట్లాడుతూ… దిగువ సభలో మాత్రం ఇప్పటి వరకు తమది ప్రత్యేక పార్టీ అంటూ ఎవరూ తనను సంప్రదించలేదని స్పష్టం చేశారు. 55 మంది శివసేన ఎమ్మెల్యేలతో కూడి షిండే వర్గం నాయకుడు భరత్ గోగావాలేను చీఫ్ విప్ గా గుర్తించినట్లు వెల్లడించారు స్పీకర్.
‘ఎగువ సభలో శివసేన చీప్ విప్ గా విప్లవ్ బజోరయాను అపాయింట్ చేయాలి చెబుతూ మేం లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్ పర్సన్ కు లేఖ ఇచ్చాం. చైర్ పర్సన్ దానిని ఆమోదించాల్సి ఉంది. షిండే తమ పార్టీ అధినేత. చీప్ విప్ ను మార్చాలని ఆయన లేఖ ఇవ్వడం కీలకం’ అని చెప్పారు. విప్ చేతులోకి తీసుకున్న తర్వాత ఉద్దవ్ థాకరే వర్గం ప్రజాప్రతినిధులపై ఏమైనా చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా… అలాంటిదేమీ లేదని చెప్పారు శివసేన సీనియర్ అడ్వోకేట్ ఎన్ కే కౌల్. సభ్యులను బడ్జెట్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని మాత్రమే తాము చెబుతున్నామన్నారు.