Delhi: దేశ రాజధాని ఢిల్లీ అలీపూర్‌లోని మార్కెట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ రంగుల పరిశ్రమలో నిన్న సాయంత్రం ఈ మంటలు చెలరేగాయి. ఈ మంటలు సమీపంలోని దుకాణాలతో పాటు ఇండ్లకు కూడా వ్యాపించాయి. ఈ ఫ్యాక్టరీలో 11 మంది కాలిపోయిన మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక పోలీసుతో సహా నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంటలు చెలరేగడానికి ముందు ఫ్యాక్టరీలో పేలుడు శబ్దం వినిపించింది.
పరిశ్రమలో నిల్వ ఉంచిన రసాయనాలతో పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పరిశ్రమ పక్కనే ఉన్న నాషా ముక్తి కేంద్రంలోకి మంటలు వ్యాపించాయి. పేలుడు కారణంగా భవనం కూలిపోయింది. మంటలు చెలరేగిన వెంటనే సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే చేరుకున్నారు. నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియదని.. గల్లంతైన వాళ్లకోసం గాలింపు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.