గుజరాత్ అల్లర్లను వ్యతిరేకించడంతోనే కేంద్ర ప్రభుత్వం తన ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదని ప్రముఖ నాట్య కళాకారిణి, పద్మభూషణ్ మల్లికా సారాభాయ్ ఆరోపించారు. తెలంగాణలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయంలో నాట్య ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామప్ప ఆలయంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ఆధ్వర్యంలో రామప్ప ఫెస్టివల్ పేరిట ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా మల్లిక నాట్య ప్రదర్శన కూడా ఉంది. ఈ కారణంగా ఉత్సవాలకు అధికారులు అనుమతి ఇవ్వలేదని సమాచారం.
అనుమతులు రాకపోవడంతో వెంటనే హనుమకొండలో ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మల్లికా సారాభాయి మాట్లాడారు. రామప్ప ఆలయ సన్నిధిలో ఉత్సవాల నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. శివుడికి ప్రీతిపాత్రమైన అభినయాన్ని శక్తిస్థలమైన రామప్ప ఆలయంలో చేయాలని నిర్ణయించుకున్నామని వివరించారు. కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతించకపోవడం దారుణమని పేర్కొన్నారు. భావ వైరుధ్యాలను కళలకు అంటకట్టడం సరికాదని మండిపడ్డారు. దేశంలో ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్ ప్రజాస్వామ్య దేశమని, ప్రశ్నించడం సగటు భారతీయుడి డీఎన్ఏలోనే ఉందని మల్లికా సారాభాయి స్పష్టం చేశారు. ప్రశ్నలు కొనసాగుతూనే ఉంటాయని, తాను ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపారు. గుజరాత్ లో 2002లో జరిగిన అల్లర్లను తాను వ్యతిరేకించానని.. అప్పటి నుంచే ప్రభుత్వం తనపై దాడికి పాల్పడుతోందని ఆరోపించారు. అప్పటి నుంచి ప్రస్తుత పాలకులతో విబేధిస్తున్నట్లు, ఇదే ధోరణిలో తాను ఉంటానని మల్లికా స్పష్టం చేశారు.