»Cash Seized Of Rs 1760 Crore In 5 States How Much In Telangana
Elections: 5 రాష్ట్రాల్లో రూ.1,760 కోట్ల నగదు సీజ్.. తెలంగాణలో ఎంతంటే..?
దేశంలో ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ 1,760 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం, వస్తువులను సీజ్ చేసినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అందులో తెలంగాణలోనే అత్యధికంగా నగదును సీజ్ చేసినట్లుగా తెలిపారు.
దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. తాజాగా తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాంలలో ఎంత సొమ్ము పట్టుబడిందనే వివరాలను ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఇప్పటి వరకూ ఐదు రాష్ట్రాల్లో కలిపి రూ.1,760 కోట్ల విలువైన నగదు, మద్యం, వస్తువులను సీజ్ చేసింది. 2018 ఎన్నికలలో ఐదు రాష్ట్రాల్లో రూ.239.15 కోట్లు పట్టుబడ్డాయి. ప్రస్తుతం ఆ సంఖ్య ఏడు రెట్లు పెరిగిందని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం రూ.1,760 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లుగా ఈసీ తెలిపింది. గుజరాత్, హిమాచల్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, కర్ణాటక ఆరు రాష్ట్రాల్లో కలిపి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రూ.1400 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ రూ.659.2 కోట్ల విలువైన నగదు, వస్తువులను సీజ్ చేసినట్లుగా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అందులో కూడా 225.23 కోట్ల నగదు పట్టుబడగా రూ.86.82 కోట్ల విలువైన మద్యం, రూ.103.74 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.191.02 కోట్ల విలువైన వస్తువులు, రూ.52.41 కోట్ల విలువైన ఉచిత బహుమతులు ఉన్నట్లుగా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
ఇకపోతే రాజస్థాన్ రాష్ట్రంలో రూ.650.7 కోట్ల విలువైన నగదును సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రూ.33.72 కోట్ల నగదు, 69.85 కోట్ల విలువైన మద్యం, 15.53 కోట్ల విలువైన డ్రగ్స్, 84.1 కోట్ల విలువైన వస్తువులు, 120.53 కోట్ల విలువైన ఉచిత బహుమతులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మొత్తం 76.9 కోట్లను, మిజోరాం రాష్ట్రంలో రూ.49.6 కోట్లను సీజ్ చేసినట్లుగా ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.