అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కాకుండా ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగి ఉంటే, ఆ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి ఉండేదని శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
Sanjay Raut: ఈసారి ఐసీసీ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఆ సమయంలో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు దీనికి సంబంధించి రాజకీయాలు కూడా మొదలయ్యాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కాకుండా ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగి ఉంటే, ఆ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి ఉండేదని శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
ఎంపి సంజయ్ రౌత్ మాట్లాడుతూ క్రికెట్ గురించి తనకు పెద్దగా తెలియకపోయినా ఫైనల్ మ్యాచ్ ఢిల్లీ లేదా ముంబైలో జరిగితే భారత్ గెలిచి ఉండేదని తనకు తెలుసునని అన్నారు. ఈసారి ఒక రాష్ట్ర రాజకీయ లాబీ క్రికెట్లోకి ప్రవేశించిందని ఆయన ఆరోపించారు. మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా కాదని, బీజేపీ వర్సెస్ ఆస్ట్రేలియా అని కూడా అన్నాడు. సంజయ్ రౌత్ జర్నలిస్టులతో మాట్లాడుతున్నప్పుడు.. ఫైనల్ మ్యాచ్‌ను బిజెపి రాజకీయ సంఘటన అని కూడా అన్నారు. నిన్నటి వరకు క్రికెట్ అంటే దేశం నలుమూలల నుంచి ప్రజలు పాల్గొనే ఆట అని, నేడు బీజేపీ అందులోకి ప్రవేశించిందని, దీంతో ఈ గేమ్ గేమ్‌లాగా కాకుండా రాజకీయంగా మారిందన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి విషయాన్ని రాజకీయంగా మారుస్తోందన్నారు.
దీనితో పాటు, ప్రపంచ మ్యాచ్ సందర్భంగా భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ను ఆహ్వానించకపోవడంపై ఎంపీ సంజయ్ రౌత్ కూడా ప్రశ్నలు సంధించారు. మ్యాచ్ చూసేందుకు రాజకీయ నాయకులు, నటీనటులను ఆహ్వానిస్తున్నారని, అయితే దేశానికి తొలి ప్రపంచకప్ గెలిచిన వారికి మాత్రం ఆహ్వానం అందలేదన్నారు. కపిల్ దేవ్ స్టేడియంలో ఉండి ఉంటే రాజకీయ నేతల కీర్తికి గ్రహణం పట్టి ఉండేదని అన్నారు. సంజయ్ రౌత్ ఇక్కడితో ఆగలేదని, కార్పొరేట్ కంపెనీలతో పాటు క్రికెట్‌ను కూడా కైవసం చేసుకోవాలని బీజేపీ యోచిస్తోందని అన్నారు.