Car wash gets banned : వేసవి కాలంలో నీటి కొరత ఎక్కువ అయిపోతోంది. భారత దేశ వ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో తాగు నీటికీ కటకటలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అక్కడ కార్ వాష్లపై(Car wash) బ్యాన్ విధించింది. మునపటి సంవత్సరాలతో పోలిస్తే అక్కడ ఈ ఏడాది నీటి కొరత అధికంగా ఉంది. గత వర్షాకాలం, శీతాకాలాల్లో వర్షాలు, హిమపాతాలు సైతం చెప్పుకోదగ్గ రీతిలో లేవు. దీంతో ప్రస్తుతం అక్కడి నీటి సమస్య(water problem) తీవ్రంగా ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో కార్లు కడగడం నిషిద్ధమంటూ ఉత్తరాఖండ్(Uttarakhand) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వర్చువల్ మీటింగ్‌లో కలెక్టర్లతో చర్చించిన ఆయన చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరిగి తాము బ్యాన్ ఎత్తివేసే వరకూ ఎక్కడా కార్ వాష్‌లు చేయకూడదన్నారు. కార్ షెడ్లలో నీటి వాష్‌లకు బదులుగా డ్రై వాష్‌లు మాత్రమే చేయాలని ఉత్తరాఖండ్ సీఎం సూచించారు.
ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్ర వ్యాప్తంగా నీటి లభ్యత చాలా తగ్గింది. నదులు, హిమానీ నదాలు లాంటి వాటిలోనూ తక్కువ స్థాయిలో మాత్రమే నీటి మట్టాలు ఉన్నాయి. గత సీజన్ అంతా వర్షాభావ పరిస్థితులు ఉండటంతో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికీ కటకటలాడుతున్నారు. చంపావత్, నైనిటాల్, డెహ్రాడూన్లాంటి చోట్ల నీటి సంక్షోభం మరీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.