Ed Raids In Ranchi : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో భారీగా డబ్బు, మద్యం లాంటివి పట్టుబడుతూ వస్తున్నాయి. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) జరిపిన దాడుల్లో ఓ పని మనిషి ఇంట్లో ఏకంగా రూ.25 కోట్లు పట్టుబడ్డాయి. ఝార్ఖండ్ మంత్రి ఆలంగీర్ ఆలం పీఏ పనిమనిషి ఇంట్లో ఈ నగదు దొరకడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో ఈ మొత్తాన్ని ఈడీ అధికారులు జప్తు చేశారు. అయితే ఇవి ఎన్నికలకు సంబంధించిన డబ్బా? లేదా అవినీతి కేసులో భాగంగా చిక్కినవా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటన రాంచీలో(Ranchi) చోటు చేసుకుంది.
ఈ డబ్బులు తనవి కావని మంత్రి పీఏ సంజీవ్‌లాల్‌కు చెందినవని పనిమనిషి పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఝార్ఖండ్ రూరల్ డవలప్మెంట్ మినిస్టర్‌గా ఆలంగీర్ ఆలం పని చేస్తున్నారు. అదే శాఖలో చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ రామ్ మనీలాండరింగ్ కేసును తాజాగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వీరేంద్ర కుమార్ అవినీతికి పాల్పడి డబ్బులు తీసుకుని, కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ(ED) అధికారులు మంత్రి పీఏ దగ్గర పని చేస్తున్న పని మనిషి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ పెద్ద మొత్తంలో డబ్బు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరేంద్ర కుమార్లో అవినీతికి పాల్పడినట్లు 2023లో కేసు నమోదైంది. అయితే ఎన్నికల వేళ మంత్రి పీఏ పని మనిషి ఇంట్లో ఇంత డబ్బు దొరకడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంట్లో నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.