Bird Flu : జార్ఖండ్ రాజధాని రాంచీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. రాంచీలోని హోత్వార్‌లో ఉన్న ప్రాంతీయ పౌల్ట్రీ ఫారం నుండి కోళ్ల నమూనాలను భోపాల్‌కు పంపారు. ఈ పౌల్ట్రీలో A5N1 ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ) ఉన్నట్లు దర్యాప్తు నివేదిక నిర్ధారించిన తర్వాత భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) పరిపాలనా విభాగంలో గందరగోళాన్ని సృష్టించింది. బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన తర్వాత ఆ ప్రాంతంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన తరువాత, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రాజధాని రాంచీలోని హోత్వార్ ప్రాంతం చుట్టూ ఒక కిలోమీటరు పరిధిలో కోళ్లు, గుడ్ల కొనుగోలు, అమ్మకాలను జిల్లా యంత్రాంగం నిషేధించింది. దీంతో ఆ ప్రాంతమంతా నిఘా పెట్టారు. పశుసంవర్థక శాఖ బృందం మొత్తం పరిస్థితిని గమనిస్తోంది. ప్రతిరోజు భారత ప్రభుత్వానికి నివేదిక పంపబడుతుంది. నెగెటివ్ రిపోర్టు వచ్చిన తర్వాతే బర్డ్ ఫ్లూ రహిత ప్రాంతంగా ప్రకటిస్తారు.
బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ రాజధాని రాంచీలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా.. ప్రజలు దాని బారిన పడకుండా చూసేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. రాంచీ డిప్యూటీ కమిషనర్ జిల్లా మేజిస్ట్రేట్ రాహుల్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లో వెటర్నరీ అధికారిని నియమించారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లోని సిబ్బందిని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారితో కలిసి పని చేయాలని కోరారు. రాంచీలోని హోత్వార్‌లో సర్వే చేయనున్న ప్రాంతాలలో గాడి గ్రామం, గాడి హోత్వార్, ఖతంగా, న్యూ ఖతంగా, మహువా టోలి, ఆర్మీ క్యాంప్, డ్యామ్ గాడి, దుమాడ్గా, బుటి మోడ్ ప్రాంతాలు ఉన్నాయి. రాంచీ డిప్యూటీ కమిషనర్ ఏర్పాటు చేసిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ నేటి నుంచి ఈ ప్రాంతాల్లో ఇంటింటికి సర్వే నిర్వహించనుంది. చికెన్, గుడ్లు తినవద్దని ప్రజలకు సూచిస్తున్నారు. దీంతో పాటు ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది.