»Budget 2024 Budget Estimates For Real Estate Sector
Budget 2024: రియల్ ఎస్టేట్ రంగం కోసం బడ్జెట్ అంచనాలు
లోక్‌సభ ఎన్నికల ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ఆరో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్ రంగం భారీగా అంచనాలు పెట్టుకుంది.
Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ఆరో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటంతో అందరి చూపు ఇప్పుడు బడ్జెట్ వైపే ఉంది. నిర్మలా సీతారామన్ విడుదల చేసే బడ్జెట్‌పై అన్ని రంగాలతో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా భారీగా అంచనాలు పెట్టుకుంది. రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించాలని, నిలిచిపోయిన హౌసింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆర్థిక మంత్రి సీతారామన్‌కు ఒక లేఖ రాసింది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం గృహ రుణ వడ్డీపై రెండు రాయితీలను అందించాలని, రూ. 5 లక్షలకు పెంచాలని, ఆదాయపు పన్ను సెక్షన్ 80c నుంచి ఇంటి రుణం అసలు మొత్తాన్ని మినహాయించాలని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆర్థిక మంత్రిని కోరింది. గత ఏడాదిలో రియల్ ఎస్టేట్ వృద్ధిలో ఉన్నప్పటికీ ఈ ఏడాది ఇంకా వృద్ధి సాధించడానికి కొన్ని కీలక అంచనాలు ఉన్నాయి.
రియల్ ఎస్టేట్ రంగంలో మరింత వృద్ధి సాధించాలంటే గృహాల విభాగమైన హ్యాండ్ హోల్డింగ్, రియల్ ఎస్టేట్ రంగానికి పరిశ్రమ హోదా, గృహ రుణ వడ్డీ రేటు రాయితీ పెంచడం, సింగిల్ విండో క్లియరెన్స్, స్టాంప్ డ్యూటీ రేట్లలో రాయితీలు, త్వరితగతిన భూసేకరణ ప్రక్రియ, జీఎస్టీ విధానంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, నిర్మాణ సామగ్రిపై పన్ను హేతుబద్దీకరణ వంటివి కోరుకున్నట్లు సమాచారం. మరి ఈసారి విడుదల చేసే బడ్జెట్ రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూలంగా ఉంటుందో లేదో చూడాలి.