దేశంలో యువకులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదు.. ఎందుకో తెలుసా? కారణం చెప్పారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. ఆయన బుధవారం కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పెళ్లి వయస్సు వచ్చినప్పటికీ యువకులకు వధువులు దొరకడం లేదని, దీంతో సామాజిక సమస్యలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన పుణేలో జన్ జాగర్ యాత్ర ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు.
వివిధ వర్గాల మధ్య చీలిక ఏర్పడిందని, ద్రవ్యోల్భణం, నిరుద్యోగం వంటి సమస్యలు ఉన్నాయని, ఈ వాస్తవ సమస్యల నుండి దృష్టి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మన దేశంలో రైతులు తమ కష్టార్జితంతో ఉత్పత్తిని పెంచి ఆకలి సమస్యను పారద్రోలుతున్నారని, కానీ అధికారంలో ఉన్న వ్యక్తులు రైతులకు కష్టానికి తగిన ఫలితం అందడంలేదన్నారు. పైగా మధ్యవర్తులు లాభపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ సామాన్య ప్రజలకు గుదిబండగా మారాయన్నారు.
యువత చదువుకున్నదని, అలాంటి వారికి ఉద్యోగం గురించి ప్రశ్నించే హక్కు ఉన్నదన్నారు. మహారాష్ట్ర నుండి పలు పరిశ్రమలు వెనక్కి తరలి వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని, కొత్త పరిశ్రమలూ రావడం లేదన్నారు. తాను ప్రయాణిస్తుండగా ఓ చోట 25 నుండి 30 ఏళ్ళ వయస్సు ఉన్న ఇరవై మంది యువత కనిపించారని, ఏం చదివారని అడగగా, కొంతమంది గ్రాడ్యుయేషన్, మరికొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లు చెప్పారని, ఎంతమందికి పెళ్లయింది అని అడగగా ఎక్కువమంది తమకు పెళ్లి కాలేదని చెప్పారని గుర్తు చేసుకున్నారు.
మీకు పెళ్లి కాకపోవడానికి కారణం ఏమిటని తాను వారిని అడిగానని, అందుకు వారు తమకు ఉద్యోగాలు లేవని, అందుకే పిల్లనిచ్చేందుకు ఎవరు ముందుకు రావడం లేదని చెప్పారు. ముఖ్యంగా ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందన్నారు. ప్రభుత్వం నిరుద్యోగాన్ని తగ్గించేందుకు, యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు కల్పించాలన్నారు.