గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండు దశల పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో ఆప్( ఆమ్ ఆద్మీ పార్టీ) తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే… గుజరాత్ లో పెద్దగా ఆప్ ప్రభావం చూపించలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్లలో కేవలం 15 శాతం నుంచి 20 శాతం ఓట్లు ఆప్ అభ్యర్థులకు పడ్డాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెల్లడైంది. ఈ ఎగ్జిట్ పోల్స్ పై తాజాగా… ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు.
తొలిసారి పోటీ చేసినప్పటికీ దాదాపు 20 శాతం ఓట్లను దక్కించుకోవడమంటే మాటలు కాదని కేజ్రీవాల్ చెప్పారు. అదికూడా బీజేపీకి కంచుకోట వంటి రాష్ట్రంలో ఈ స్థాయిలో ఫలితాలు రాబట్టడం సాధారణ విషయం కాదని చెప్పారు. గుజరాత్ ప్రజల మనసులను తాము గెలుచుకున్నామనేందుకు ఈ అంచనాలే నిదర్శనమని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పార్టీకి సానుకూలంగానే భావిస్తున్నట్లు కేజ్రీవాల్ వివరించారు.
మరోపక్క, ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ తేలింది. ఇక, హిమాచల్ ప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ ప్రభావం చూపించలేదని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి.