బీహార్‌లో రైలు ఇంజిన్, బ్రిడ్జీ చోరి జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా 2 కిలోమీటర్ల మేర పట్టాలను తీసుకెళ్లారు. ఈ ఘటన గత నెలలో జరిగింది. విచారణ జరిపితే ఇద్దరు ఉద్యోగుల పాత్ర ఉందని తెలిసింది. దీంతో వారిని విధుల నుంచి తప్పించారు. సమస్తిపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రైల్వే ట్రాక్‌ను దొంగిలించి స్క్రాప్ డీలర్‌కు విక్రయించారు. షుగర్ మిల్లుకు అనుసంధానం అయ్యే ట్రైన్ ట్రాక్ పై రాకపోకలు లేవు. దీంతో గత కొన్నేళ్లుగా మూతపడింది. జన సంచారం లేకపోవడంతో దొంగలు తమ చేతికి పనిచెప్పారు.
సమస్తిపూర్ లోహత్ చక్కెర ఫ్యాక్టరీని కొంతకాలం కింద మూసివేశారు. గతంలో సరకు రవాణా కోసం ఈ రైలు మార్గం నిర్మించారు. దీని ద్వారా మిల్లు పాండౌల్ రైల్వే స్టేషన్‌కు కనెక్ట్ చేశారు. షుగర్ మిల్లు మూతపడిన తర్వాత ఇక్కడి వస్తువులను స్క్రాప్‌గా వేలానికి పెట్టాలని భావించారు. అందులో రైలు పట్టాలు కూడా ఉన్నాయి. 2 కి.మీ మేర రైలు మార్గాన్ని కొందరు చోరీ చేశారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో విచారించారు. రైల్వే డివిజన్ ఉద్యోగుల సహకారంతో రైలు పట్టాలను విక్రయించారని అధికారులు గుర్తించారు. అర కిలోమీటర్ మేర పట్టాలు చోరీ చేసి స్క్రాప్ కింద విక్రయించారని బుకాయించే ప్రయత్నించారు.
దర్భంగా ఆర్పీఎఫ్ పోస్ట్ వద్ద రైలు పట్టాల చోరీపై కేసు నమోదు చేశారు. మధుబనికి చెందిన జమాదార్ ముఖేష్ కుమార్ సింగ్, ఝంజర్పూర్ అవుట్ పోస్టుకు కమాండ్‌గా ఉన్న శ్రీనివాస్ ప్రమేయం ఉందని ప్రాథమిక విచారణలో తేలింది. రైలు ట్రాక్‌ను వేలం వేయకుండా, టెండర్లకు పిలవకుండా ఉద్యోగులే ఓ వ్యాపారికి విక్రయించారని అభియోగాలు నమోదు చేశారు.