Maharashtra : రైళ్లల్లో వాటర్ బాటిల్ అమ్మేందుకు మొదలైన గొడవ హత్యలతో ముగిసింది!
మహారాష్ట్రలోని రైళ్లలో వాటర్ బాటిళ్లను అమ్మే విషయంలో గొడవ పడి ముగ్గురు కలిసి, ఇద్దరిని హత్య చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది... వివరాల్లోకి వెళితే...
Maharashtra crime news : చిన్న గొడవతో ప్రారంభమైన ఓ ఘర్షణ చివరికి రెండు హత్యలకు దారి తీసింది. రైళ్లల్లో వాటర్ బాటిల్స్ అమ్మే వ్యాపారం నేపథ్యంలో గొడవ జరగ్గా.. ముగ్గురు వ్యక్తులు, మరో ఇద్దరిని దారుణంగా హతమార్చారు. మహారాష్ట్ర(Maharashtra)లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి థానే ప్రాంతంలో జరిగిందీ సంఘటన.
ఈ గొడవలో చనిపోయిన ఇద్దరు, నిందితులు కూడా రైళ్లలో మంచి నీటి సీసాలు అమ్ముకుని వ్యాపారం సాగిస్తారు. ఇదే విషయంలో వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ విభేదాలు కొన్ని నెలలుగా జరుగుతున్నాయి. ఇవే చివరికి వీరిలో ఇద్దరు వ్యక్తుల హత్యకు దారి తీశాయి. ఫిబ్రవరి 3వ తేదీన ఓ వ్యక్తి మృతదేహాన్ని వైతరణి నదిలో పోలీసులు గుర్తించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో ఫిబ్రవరి 6న కసర ఘాట్లో పోలీసులకు మరో మృత దేహం కనిపించింది. ఈ రెండు మృత దేహాలకు లింక్ ఉందని తెలుసుకున్న పోలీసులు ఆ కోణంలో విచారించారు.
మృతుల్లో ఒకరి చేతిపై టాటూలు ఉన్నాయి. వాటి ఆధారంగా మృతుడు 25ఏళ్ల దీపక్ థోకే అని పోలీసులు గుర్తించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టగా రైళ్లల్లో వాటర్ బాటిల్స్ అమ్ముకునే మరికొందరితో అతనికి విభేదాలు ఉన్నాయని తెలిసింది. చివరికి నిందితులు 38ఏళ్ల పెంట్యా చిటారి, 22ఏళ్ల సైకుమార్ కదామచి, 29ఏళ్ల కిషోర్ హత్యలు చేసి తర్వాత హైదరాబాద్కు పారిపోయారు. పోలీసులు ఇద్దరు నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.