దర్శకధీరుడు రాజమౌళిని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన ఆర్ఆర్ఆర్.. ఈ సారి ఆస్కార్ బరిలో నిలవడం ఖాయమని.. గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్‌కు ఆస్కారం ఉందని యావత్ సినీ ప్రపంచం కితాబిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్‌కు ఆస్కార్ రావడం పక్కా అని గట్టి బజ్ వినిపిస్తోంది. అయితే ఇలా ప్రపంచ వ్యాప్తంగా సాలిడ్ వసూళ్లను రాబట్టి.. సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్.. రచ్చ గెలిచి ఇంట ఓడిపోయింది. ఊహించని విధంగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ మూవీ ‘చెల్లో షో’ని ఇండియా తరుపున ఆస్కార్‌కు ఎంపిక చేసింది. దీనిపై పలువురు సినీ ప్రముఖులు గట్టిగానే విమర్శిస్తున్నారు.
ఇండియాకు ఆస్కార్ తీసుకొచ్చే దమ్ము ఆర్ఆర్ఆర్కు మాత్రమే ఉందని అంటున్నారు. అందుకే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీని ఆస్కార్ రేసులో తీసుళ్లేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 30న హాలీవుడ్లో.. ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ మూవీ స్పెషల్ షో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అక్కడ ఆస్కార్ అకాడమీ సభ్యుల్లో ఓ కీలక వ్యక్తి RRRని వీక్షించబోతున్నట్టు సమాచారం. దాంతో ఈ షో RRRకు అత్యంత కీలకంగా మారబోతోందని అంటున్నారు. దాంతో ఆ రోజు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ భవితవ్యం తేలిపోనుందని చెప్పొచ్చు. ఏదేమైనా సరే.. ఈ సారి ఆస్కార్ రేసులో మన సినిమా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.