తమిళ దర్శకుడు అట్లీ కాపీ వివాదంలో ఇరుక్కున్నారు. బాలీవుడ్ బాద్షా హీరోగా… అట్లీ.. జవాన్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సినిమాని కాపీ చేశారంటూ ఆరోపణలు రావడం గమనార్హం. మాణిక్యం నారాయణన్ అనే నిర్మాత ఈ సినిమా కథ తనదని.. దర్శకుడు అట్లీ కాపీ చేశారని ఆరోపిస్తున్నారు.
ఆరోపించడమే కాదు.. అట్లీ జవాన్ సినిమా పై ప్రముఖ తమిళ నిర్మాత మాణికం నారాయణన్ తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి లో ఫిర్యాదు చేసారు. విజయకాంత్ నటించిన 2006 తమిళ చిత్రం `పేరరసు`ని కాపీ చేసాడని దర్శకుడు అట్లీపై ఫిర్యాదు చేసాడు. రెండు కథలు ఒకేలా ఉన్నాయని అతడు ఆరోపిస్తున్నా కానీ ఫిర్యాదునకు కారణం అస్పష్టంగా ఉంది. అట్లీ తన చిత్రాలతో ప్లాగరిజం సమస్యలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదని కూడా సదరు నిర్మాత విమర్శించారు. ‘పేరరసు’ హక్కులు ఇప్పటికీ తన దగ్గరే ఉన్నాయని.. అలాంటి కథను ఎలా కాపీ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు మాణిక్యం.
‘పేరరసు’ చిత్రంలో విజయకాంత్ కవల సోదరులుగా కనిపిస్తారు. పేరరసు -ఇళవరసుగా ద్విపాత్రాభినయం చేసారు. ఈ చిత్రంలో రెండో క్యారక్టర్ బాధ్యతాయుతమైన సీబీఐ అధికారి అయితే.. తన తండ్రి మరణానికి కారకుడైన మాజీ మంత్రిపై ప్రతీకారం గా అతడిని చంపాలని వేట సాగించేవాడిగా మొదటి పాత్ర నడుస్తుంది. జవాన్ కూడా అలాంటిదే అంటున్నారు.
ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. హిందీ- తమిళం- తెలుగు- మలయాళం – కన్నడ భాషల్లో 2 జూన్ 2023న `జవాన్` విడుదల కానుంది.మరి ఈ కాపీ ఆరోపణలపై అట్లీ ఎలా స్పందిస్తాడో చూడాలి.