SHAITAN Web Series Review: సైతాన్ వెబ్ సిరీస్ రివ్యూ
మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన సైతాన్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. 9 ఎపిసోడ్స్ ఉండగా.. న్యూడిటీ కంటెంట్ ఎక్కువగా ఉంది. మితిమీరిన శృంగారం.. బూతు డైలాగ్స్ ఉండటం వల్ల ఫ్యామిలీ కలిసి చూడలేని పరిస్థితి.
SHAITAN Web Series Review: మహి వి రాఘవ్ నిర్మించి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ సైతాన్ (SHAITAN). ఈ సిరీస్‌లో బోల్డ్ కంటెంట్, డైలాగ్స్ ఎక్కువగా ఉన్నాయి. ట్రైలర్ చూస్తేనే అర్థమయ్యింది. ఇక సిరీస్ చూస్తే స్పష్టమైంది. అందుకే హెడ్ ఫోన్స్ వాడాలని మేకర్స్ సూచించారు. బాలి కుటుంబంలో జరిగిన కథను దర్శకుడు చక్కగా మలిచాడు.
సిరీస్: సైతాన్ నటీనటులు: రిషీ, షెల్లీ, రవి కాలే, దేవయాని శర్మ, జాఫర్ సాదిక్, నితిన్ ప్రసన్న తదితరులు సినిమాటోగ్రఫీ:షణ్ముగ సుందరం సంగీతం: శ్రీరామ్ మద్దూరి నిర్మాత: మహి వి రాఘవ్, చిన్నా వాసుదేవ్ రెడ్డి దర్శకత్వం: మహి వి రాఘవ్ విడుదల తేదీ:జూన్ 15, 2023 ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఎపిసోడ్స్: 9
కథ:
సావిత్రికి బాలి, జయ, గుమ్తి ముగ్గురు పిల్లలు. భర్త వదిలేసి వెళ్లడంతో పిల్లల పోషించడానికి ఓ పోలీసు అధికారికి ఉంపుడుగత్తెగా ఉంటుంది. తల్లి గురించి ఇరుగు పొరుగు వారు మాటలు అనడం బాలికి నచ్చదు. ఆ పని చేయొద్దని తల్లికి చెబితే.. నువ్వు సంపాదించే రోజు వచ్చినప్పటి నుంచి ఇలాంటి పని చేయడం మానేస్తా అని చెబుతోంది. దాంతో పని చేయడానికి వెళ్లిన బాలికి ఎవరూ పని ఇవ్వరు. తమ్ముడు ఆకలి అనడం.. బిర్యానీ కోసం ఒళ్లు హునం చేసుకోగా.. పోలీసు అధికారి వచ్చి ఆ డబ్బు తీసుకుంటాడు. ఉన్న చిల్లరతో బ్రెడ్ తింటారు. తర్వాత బాలి చెల్లిపై పోలీసు అధికారి కన్ను పడుతుంది. బలవంతంగా చేయబోగా.. బాలి తల్లి, బాలి, అతని తమ్ముడు కలిసి ఆ పోలీసును చంపేస్తారు. జైలు నుంచి బయటకి వచ్చిన తర్వాత పొట్ట కూటి కోసం హత్యలు చేస్తుంటాడు. తర్వాత నక్సలైట్లలో చేరాల్సి వస్తోంది. తమ్ముడు గుమ్తి హత్యకు గురవుతాడు. కళావతితో బాలికి ఉన్న బంధం ఏంటి, పోలీసు అధికారి నాగిరెడ్డి పాత్ర ఏంటీ.. బాలి ఎలా చనిపోయాడు అనేది తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.
ఎలా సాగిందంటే..
సైతాన్ (SHAITAN) సిరీస్‌లో 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతీ ఎపిసోడ్లో బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్‌తో సైతాన్ ప్రపంచంలోకి తీసుకెళ్లాడు డైరెక్టర్ మహి వి రాఘవ్. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేయడం ప్రారంభించి.. తనువు చాలించిన నేరస్తుని కథే సైతాన్. బాలి కుటుంబం చేసే హత్యలు క్రూరంగా ఉంటాయి. అలా చేయడంలో తప్పు లేదన్నట్టు కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. భర్త లేని మహిళ తప్పని పరిస్థితుల్లో వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఆమెపై సమాజం వేసే ముద్ర.. ఆ మగాడికి పేరు పెట్టలేదనే డైలాగ్స్ ఉంటాయి. ఎమోషనల్ సీన్స్ చాలా ఉన్నాయి. అతి హింస, శృంగార సన్నివేశాల వల్ల ఫ్యామిలీ చూడలేని పరిస్థితి.. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం కనెక్ట్ అవుతారు.
సైతాన్-2..?
సిరీస్‌లో పోలీసులు- మావోయిస్టుల మధ్య వార్ ప్రధానంగా చూపిస్తారు. గతంలో ఇలాంటి మూవీస్ వచ్చినప్పటికీ దర్శకుడు కొత్తగా చూపించారు. బాలి చుట్టూనే సిరీస్ జరుగుతోంది. అతని తమ్ముడు హత్య.. తర్వాత ఒక్కొక్కరి మర్డర్ సిరీస్‌లో మరింత హైప్ పెంచుతుంది. చివరికీ బాలి హత్య.. ఆ తర్వాత గొర్రెల కాపరిని రేప్ చేయడం, అక్కడ ఓ కుర్రోడు ఉండటాన్ని బట్టి సైతాన్-2 వస్తోందని పక్కా ఊహించగలం. నాగిరెడ్డి పోలీసు శాఖను వీడి పొలిటిషీయన్ అవతారం ఎత్తాడు. హోం మంత్రి సీఎం పదవీపై ఫోకస్ చేశాడు. దీంతో సైతాన్-2పై అప్పుడే అంచనాలు నెలకొన్నాయి.
ఎవరెలా చేశారంటే..?
బాలి పాత్రకు రిషి వంద శాతం న్యాయం చేశాడు. అమాయకత్వం, కోపం, ఆవేశం కలగలిసి నటించి మెప్పించాడు. పాత్రకు తగిన నటుడిలా కనిపించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌కు పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాడు. జయప్రదగా దేవయాని శర్మ డీ గ్లామర్ లుక్‌లో బోల్డ్ యాక్టింగ్ చేశారు. గుమ్తి పాత్రలో జాఫర్ తప్ప మరొకరిని ఊహించుకోలేము. కామక్షి భాస్కర్ల, షెల్లీ, రవి కాలే ఇతరులు తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగాల పనితీరు
టెక్నికల్‌గా వెబ్ సిరీస్ బాగుంది. సున్నితమైన అంశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ చేసేందుకు డైరెక్టర్ శ్రమించాడు. తాను అనుకున్నది చక్కగా తెరపై రీ ప్రజెంట్ చేశాడు. వెబ్ సిరీస్ మొత్తంలో డైరెక్టర్ కనిపిస్తాడు. ప్రతీ సీన్, డైలాగ్‌లో అతని పనితనం కనిపిస్తోంది. శ్రీరామ్ మద్దూరి బీజీఎం, షణ్ముగ సుందరం సినిమాటోగ్రఫీ కథకు సరిపోయాయి.