»Renudesai Said That I Am Lucky To Get The Chance To Act In That Hemalatha Role In Tiger Nageswarrao Movie
Renu Desai: ఆ పాత్రలో నటించే అవకాశం రావడం నా అదృష్టం
ఒకప్పుడు హీరోయిన్గా నటించిన రేణుదేశాయ్.. దాదాపు 20ఏళ్ల తర్వాత క్యారెక్టర్ నటిగా నటిస్తున్నారు. రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో ప్రముఖ సంఘ సంస్కర్త హేమలత పాత్రలో నటించిన ఈమె ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెలియజేశారు.
Renu Desai: కథానాయికగా సుపరిచితమైన రేణుదేశాయ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో క్యారెక్టర్ నటిగా మారారు. దాదాపు 20ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లో నటించారు. రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఈమె ప్రముఖ సంఘ సంస్కర్త హేమలత లావణం పాత్రని పోషించారు. ఈ సందర్భంగా రేణు కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఎప్పుడూ నాదగ్గరికి కథలు వస్తుంటాయి. మంచి పాత్ర వస్తేనే నటించాలని అనుకునేదాన్ని. ఈ సినిమాకి అన్ని కుదిరాయి. హేమలత లవణం ఆ పాత్ర నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఇలాంటి గొప్ప వ్యక్తి పాత్రలో నటించే అవకాశం రావడం నా అదృష్టమని ఆమె తెలిపారు.
ఈ సినిమా చేసేంతవరకు నాకు హేమలత గురించి తెలియదు. ఆమె జీవితం ప్రస్తుత యువతరానికి స్ఫూర్తిదాయకం. సామాజికంగా ఎన్నో సేవలు చేశారు. జోగినివ్యవస్థ, అంటరానితనంపై పోరాటం చేశారు. ఈ మూవీ నా వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపించింది. ఇప్పటివరకు నేను చేస్తున్న సామాజిక కార్యక్రమాలు సరిపోవు. ఇంకా చేయాలి. పిల్లలను, ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఇకపై మరికొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నా. ఈ విషయంలో ఆమెనే నాకు స్ఫూర్తి. ఇప్పటివరకూ నా జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఆమెను ప్రత్యక్షంగా కలవకపోవడమేనని రేణుదేశాయ్ తెలిపారు. విజయవాడలో ఉండే హేమలత మేనకోడలు కీర్తీని కలిసినప్పుడు ఆమె చాలా విషయాలు చెప్పారు. ఫొటోలు కూడా చూపించారు. ఇవన్నీ నేను ఆ పాత్ర చేయడానికి సాయపడ్డాయని ఆమె తెలిపారు. ట్రైలర్ చూసిన వెంటనే ఆద్య.. ‘వయస్సుకు తగ్గ పాత్ర చేసినందుకు గర్వంగా ఉందమ్మా’ అని చెప్పింది. నాకు ఆ మాట గొప్ప ప్రశంసని రేణుదేశాయ్ తెలిపారు.