ప్రస్తుతం వాస్తవ సంఘటనలతో చాలా సినిమాలు వస్తున్నాయి. ఈక్రమంలో తాజాగా రజాకార్ సినిమా వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యం కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించగా.. గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. ఇందులో ఇంద్రజ, బాబీ సింహా, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈరోజు ధియేటర్లలో విడుదలయిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
చిత్రం:రజాకార్ నటీనటులు: బాబీ సింహా, వేదిక, అనసూయ, ఇంద్రజ, ప్రేమ, మకరంద్ దేశ్ పాండే, రాజ్ అర్జున్, తేజ్ సప్రు, జాన్ విజయ్, దేవీ ప్రసాద్ తదితరులు సంగీతం: భీమ్స్ సిసిరోలియో ఛాయాగ్రహణం: కె.రమేష్ రెడ్డి నిర్మాత:గూడూరు నారాయణ రెడ్డి రచన, దర్శకత్వం:యాటా సత్యనారాయణ విడుదల తేదీ: 15-03-2024
కథ
నైజాం(హైదరాబాద్) రాజ్యాన్ని నిజాం నవాబ్లు పాలిస్తూ వచ్చారు. వారిలో చాలా మంది మంచి పనులు చేశారు. కానీ ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చినా ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రాజ్యాన్ని అఖండ భారతంలో విలీనం చేసేందుకు ససేమిరా అన్నారు. తాను హైదరాబాద్‌ని స్వాతంత్ర్య రాజ్యంగా పాలించుకుంటానని కేంద్రానికి తేల్చి చెప్పారు. కానీ ఇక్కడ అనేక ఆగడాలకు, అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఖాసీం రజ్వీ సారథ్యంలో రజాకార్ వ్యవస్థని ఏర్పాటు చేసి ప్రజలపైకి ఉసిగోల్పారు. హిందూ, ముస్లిం అనే కోణంలో హిందూవులను ముస్లింలుగా మారాలని హుకుం జారీ చేశారు. బలవంతంగా మత మార్పిడిలు చేయించారు. హైదరాబాద్‌ని ముస్లిం రాజ్యంగా మార్చే కుట్రలకు పాల్పడ్డారు. తమ మాట వినని వారు, సిస్తు కట్టని జనాలను దారుణంగా హింసించేవారు. పంటలను లాక్కెల్లేవారు. ఈ క్రమంలో ఐలమ్మ, నారాయణరెడ్డి, రాజన్న వంటి అనేక మంది నాయకులు రజాకార్లకి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి పోరాడారు. అందులో ప్రాణాలు వదిలేశారు. పరకాలలో హింసా కాండ, బైరాన్ పల్లి మరణహోమం, అలాగే గుండ్రంపల్లి దారుణా ఘటనలు, నిజాం, ఖాసీం రజ్వీ, రజాకార్ల ఆగడాలు, అరాచకాలు ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కి చేరాయి. కానీ ఏం చేయలేని పరిస్థితి. వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రధాని నెహ్రూ ఒప్పుకోవడం లేదు. దీంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని ఎలా ఇన్నిషియేట్ తీసుకున్నాడు? ఈ సమస్యకి ఎలా పరిష్కారం చూపించారు. ఇందులో రజాకార్లతో ఇంకా ఎవరెవరు పోరాడి ప్రాణాలు కోల్పోయారు? ఎలాంటి పరిస్థితిల్లో నిజాం.. హైదరాబాద్‌ని భారత్‌లో విలీనం చేసేందుకు ఒప్పుకున్నాడనేది సినిమా.
ఎలా ఉందంటే?
ప్రపంచంలోని పోరాటాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. నిజాం పరిపాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఎన్నో ఆరాచకాలు, అకృత్యాతు జరిగాయి. గ్రామాల్లో రజాకార్లు ఎంతటి దురాగతాలకు పాల్పడ్డారు. వారిని ఎదిరించి పోరాడే క్రమంలో ప్రజలే సాయుధులై రంగంలోకి దూకారు. ఇలా ఎందరో యోథులు వీరమరణం పొందారు. టైటిల్ కార్డ్స్‌తో తెలంగాణ చరిత్రను పరిచయం చేసి.. స్వాతంత్ర్యానంతరం దేశంలోని పరిస్థితుల్ని.. అప్పటి హైదరాబాద్ సంస్థానంలో నిజాం పరిపాలనను చూపిస్తూ నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక అక్కడి నుంచి రజాకార్ల దుశ్చర్యలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ సినిమాని ఆసక్తికరంగా ముందుకు నడిపించారు. అప్పట్లో తబ్లిగ్ ఫర్మానా పేరుతో రజాకార్లు ప్రజల్ని బలవంతంగా మతమార్పిడి చేయించిన తీరు.. తెలుగు భాష మాట్లాడుతున్నారన్న అక్కసుతో బడుల్లో పిల్లలపై వారు చేసిన దారుణాలు.. ఊళ్లలో మహిళలు, ఆడపిల్లలపై రజాకార్లు, వాళ్ల ప్రతినిధుల అఘాయిత్యాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ప్రథమార్ధం సాగుతుంది. అయితే దీంట్లో ప్రత్యేకంగా హీరోలంటూ ఎవరూ కనిపించరు. ఎందుకంటే ప్రతి పది పదిహేను నిమిషాలకు ఒకసారి ఓ శక్తిమంతమైన పాత్ర తెరపైకి వచ్చి తనదైన పోరాట స్ఫూర్తిని చూపించి మాయమవుతుంటుంది. ఇవన్నీ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఉన్న వీరగాథలే. అయితే అవన్నీ తెలిసిన కథలే అయినా తెరపై చూసినప్పుడు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. కొన్ని ఎపిసోడ్లలో రజాకార్ల అకృత్యాలు చూస్తున్నప్పుడు వాళ్లు కనిపిస్తే నిజంగా మనమే తిరగబడాలన్నంత ఆవేశం కలిగించేలా ఉంటాయి. ప్రథమార్ధంలో ఎక్కువగా రజాకర్ల అకృత్యాలను చూపిస్తారు. ద్వితీయార్ధంలో వారికి ఎదురుతిరిగిన ప్రజల పోరాట స్ఫూర్తిని చూపించే ప్రయ్నతం చేశారు. ఇలా జరిగిన పోరాటాలు చూపించారు. ఇవి ఆకట్టుకునేలా ఉంటాయి. ప్రథమార్ధమంతా తెర వెనుక ఉండి చర్చలు జరుపుతూ కూర్చున్నట్లు ఉన్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ పాత్ర ప్రీక్లైమాక్స్‌లో తెరపైకి వచ్చి నిజాం రాజ్యంలోకి అడుగుపెట్టడంతో కథకు ఊపొస్తుంది. ఈ క్రమంలో ఖాసీం రిజ్వీకి పటేల్ ఇచ్చే వార్నింగ్ ఎపిసోడ్ హైలైట్. ఇక పతాక సన్నివేశాలు భారత ప్రభుత్వం చేపట్టే పోలీస్ చర్యతో సాగుతాయి.
ఎవరెలా చేశారంటే?
ఈ సినిమాలో ప్రత్యేకంగా ఫలానా పాత్రే కీలకం అని చెప్పడానికేం లేదు. ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో పాత్ర హీరోగా నిలిచింది. చాకలి ఐలమ్మగా ఇంద్రజ, రాజిరెడ్డిగా బాబీ సింహా, శాంతవ్వగా వేదిక, నిజాం రాజుగా మకరంద్ దేశ్ పాండే, సర్దార్ వల్లభభాయ్ పటేల్‌గా రాజ్ సప్రు, కాసిం రిజ్వీగా రాజ్ అర్జున్, లాయక్‌గా జాన్ విజయ్.. ఇలా ప్రతిఒక్కరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోవడమే కాదు.. అద్భుతమైన నటనతో అదరగొట్టారు. ముఖ్యంగా కాసీం రిజ్వీ పాత్రలో రాజ్ అర్జున్ కనబర్చిన నటన.. పలికించిన హావభావాలు.. సంభాషణలు పలికిన తీరు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. దర్శకుడు యాట సత్యనారాయణ తను రాసుకున్న కథను యథాతథంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని ఎపిసోడ్స్ చాలా బాగా చూపించారు.
సాంకేతిక అంశాలు
టెక్నికల్‌గా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. 1947-48నాటి తెలంగాణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. అలాగే ఈ విషయంలో గ్రాఫిక్స్ వర్క్ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. బతుకమ్మ పాటతో పాటు ప్రథమార్ధంలో వచ్చే మరో గీతం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. నేపథ్య సంగీతం కథకు బలాన్నిచ్చింది. ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.