రాష్ట్ర భవిష్యత్తు, రాజధాని నిర్మాణం కోసం మూడు పంటలు పండే తమ పంట పొలాల్ని ఇస్తే.. ఆ రైతులకి కన్నీళ్లే ఎదురయ్యాయి. వాస్తవ కథగా రాజధాని ఫైల్స్ సినిమా తెరకెక్కింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
అరుణప్రదేశ్ రాష్ట్రంలోని అయిరావతి ప్రాంతం ఏడాదికి రెండు మూడు పంటలు పండే అద్భుతమైన వ్యవసాయ భూమిని కలిగి ఉంటుంది. అయితే ఆ ప్రాంతం రాష్ట్రానికి నడిబొడ్డున ఉండటం, అన్నింటికీ అనువైన ప్రాంతం కావడంతో.. ప్రభుత్వం అయిరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేస్తుంది. తరతరాలుగా ఆ భూమినే నమ్ముకొని బ్రతుకుతున్న రైతులకు.. తమ భూములు ఇవ్వడం ఇష్టంలేనప్పటికీ.. రాష్ట్రం కోసం, భావి తరాల భవిష్యత్ కోసం.. త్యాగానికి సిద్ధపడతారు. విశ్వనగరం లాంటి రాజధాని నిర్మాణం జరిగితే.. ఎన్నో కంపెనీలు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, యువత భవిష్యత్ బాగుంటుందని ఎంతో సంతోషంగా భూములు త్యాగం చేస్తారు రైతులు. రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటంతో, తాము కలలు కన్న రాజధానిని త్వరలోనే చూసుకోబోతున్నామని రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుండగా.. కొత్త ప్రభుత్వం వచ్చి వారి ఆశలపై నీళ్లు చల్లుతుంది. వారి త్యాగాన్ని వృధా చేస్తుంది. అయిరావతి రాజధానిగా ఉంటే గత ముఖ్యమంత్రి పేరే చరిత్రలో నిలిచిపోతుంది, నీకు ఎలాంటి పేరు రాదని తన పొలిటికల్ అనలిస్ట్ చెప్పిన మాటలతో.. నూతన ముఖ్యమంత్రి నాలుగు రాజధానుల రాగాన్ని ఎత్తుకుంటాడు. దీంతో అయిరావతి రైతులు అహింస మార్గంలో ఉద్యమానికి దిగుతారు. ఆ ఉద్యమాన్ని అణచడానికి సీఎం, అతని అనుచరగణం చేయని దుర్మార్గం ఉండదు. ఆ దుర్మార్గాలను తట్టుకొని రైతులు ఎలా పోరాడారు? ఆ పోరాట ఫలితంగా అయిరావతే రాజధానిగా ఉందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే?
ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై తీసిన సినిమా. పాలిటిక్స్‌కు సంబంధించి ఇప్పటికీ ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇవి ఇంట్రెస్ట్‌ను కలిగించాయి. అయితే రాజధాని ఫైల్స్ సినిమా తెలిసిన కథ. దీన్ని ఎలా దర్శకుడు తెరకెక్కించాడని చాలామంది వీక్షించారు. ఫస్టాఫ్‌లో రాజధాని ఏర్పాటు కోసం రైతులు భూములు ఇవ్వడం వంటి సీన్లను చూపించాడు. కథ ఇంట్రెస్ట్‌గా సాగుతుందకున్న సమయంలో ట్రాక్ తప్పుతుంది. అనవసరమైన గొడవలు, నమ్మశక్యంగా లేని కొన్ని సీన్లు, అవీ కాకుండా తెలిసిన కథను కూడా కొంత కల్పితంగా చూపించారు. ఇవి ఈ చిత్రానికి కొంత మైనస్ అని చెప్పుకోవచ్చు. సెకండాఫ్ అయితే ఒక రివెంజ్ స్టోరీలా మారిపోయింది. ఏపీ రాజకీయాలు లక్ష్యంగా పెట్టుకుని సినిమా తీసినట్లు అనిపించింది.
ఎవరెలా చేశారంటే?
రైతు ప్రతినిధులుగా, దంపతులుగా వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ నటన బాగుంది. వీళ్ల కుమారుడిగా అఖిలన్ నటించాడు. ద్వితీయార్థంలో అఖిలన్ నటన ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. దర్శకుడు తీసుకున్న కథను స్క్రీన్‌పై ఇంకా సరిగ్గా చూపించి ఉంటే బాగుండేది.
సాంకేతిక అంశాలు
టెక్నికల్ విషయానికొస్తే.. మ్యూజిక్ జస్ట్ ఒకే అన్నట్లు ఉంది. కెమెరా వర్క్, ఎడిటింగ్ అంత గొప్పగా ఏం లేవు. బీజీఎం కూడా రొటీన్‌గానే ఉంది. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉంది.
ప్లస్ పాయింట్స్
వాస్తవ నేపథ్యం
భావోద్వేగాలు
కొన్ని సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
ఆరంభంలోని కొన్ని సన్నివేశాలు
స్క్రీన్ ప్లే