లోకేష్ కనగరాజ్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకులలో ఒకరిగా మారారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి సినిమాకీ వేరియేషన్స్ ఇస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఆయనతో కలిసి పని చేయడానికి చాలా మంది నటీనటులు ఎదురుచూస్తున్నారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి బ్లాక్బస్టర్లను అందించిన ఆయన ట్రాక్ రికార్డ్ పరిశ్రమలో ఆయన స్థాయిని పెంచింది. ఇప్పుడు సూర్యతో సినిమా ప్లాన్ చేశాడని కోలీవుడ్‌లో ఆసక్తికర ఊహాగానాలు సాగుతున్నాయి.
హీరో సూర్యతో ప్లాన్ చేసిన సినిమా లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్ “ఇరుంబుకై మాయావి” అని తెలుస్తోంది. ఈ కథ 1962 DC కామిక్స్ నవల “ది స్టీల్ క్లాన్” ఆధారంగా రూపొందించారట. స్క్రిప్ట్ ప్రతికూల షేడ్స్‌తో సూపర్ హీరో జానర్లోకి వెళుతుంది. యాక్సిడెంట్లో చేయి పోగొట్టుకున్న హీరో, ఉక్కు చేతిని అమర్చుకుంటాడు. ఈ నేపథ్యంలో కథ సాగుతుంది. అయితే తదనంతరం, మరొక ప్రమాదం అతనికి ఒక ప్రత్యేకమైన శక్తిని ఇస్తుంది. అది అతని చేతిని మినహాయించి పూర్తిగా కనిపించకుండా చేస్తుంది. అతను శత్రువులతో పోరాడటానికి, తన దేశానికి సేవ చేయడానికి ఈ శక్తిని ఉపయోగించాలని నిర్ణయించుకుంటాడు.
కథ వినడానికే ఇంత బాగుందంటే, సినిమాగా వస్తే ఇంకెంత బాగుంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. సూర్య ప్రధాన పాత్రలో నటించడం చాలా అద్భుతంగా ఉంది. అయితే ఈ కథను నిజం చేయాలన్న కలను లోకేష్ నెరవేర్చుకోలేదు. లోకేష్ కనగరాజ్ ఇండస్ట్రీకి కొత్త అయినప్పుడు మొదట్లో ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు కానీ నిర్మాత కోసం వెతుకుతూ పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఆయన ఈ ప్రత్యేకమైన సూపర్ హీరో కథకు ప్రాణం పోసేందుకు ఆలోచిస్తున్నాడు.
సూర్య ఈ మూవీలో హీరోగా నటించే అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా స్క్రిప్ట్‌ను రూపొందించేందుకు లోకేష్ కొన్ని కీలక మార్పులు చేస్తారని వినికిడి. సూపర్ హీరో ఫాంటసీ జానర్లో ఈ మూవీ సాగనుందట. లోకేష్ గత సినిమాలన్నీ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లతో ఉంటాయి. మరోవైపు లోకేష్ తన సినిమా విక్రమ్ లోని రోలెక్స్ అనే పేరుతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.