సినిమా బాగుంటే చాలు.. భాషా భేదం లేకుండా బ్రహ్మరథం పట్టడంలో తెలుగు ఆడియెన్స్ ముందు వరుసలో ఉంటారు. ఎలాంటి డబ్బింగ్ సినిమా అయినా.. పరిచయం లేని హీరోలున్న సరే థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. ఆ మధ్యన కెజియఫ్ ఎంత బ్లాక్ బస్టర్గా నిలిచిందో తెలిసిందే. ఇక ఇప్పుడు అదే కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘కాంతార'(kantara) అనే సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది.
రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు వారాల క్రితమే కన్నడలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్గా నిలిచింది. దాంతో ఈ వారం గీతా ఆర్ట్స్ తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేసింది. భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ అందుకున్న ఈ సినిమా.. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు మరిన్ని స్క్రీన్స్ పెరుగుతున్నాయి. ఓ పక్క మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ థియేటర్లో రన్ అవుతున్నప్పటికీ.. కాంతార క్రేజ్ చూస్తే షాక్ అవాల్సిందే.
పెద్దగా ప్రమోషన్స్ కూడా లేని ఈ సినిమా.. ఊహించని విధంగా భారీ ఓపెనింగ్స్ అందుకుంది. తెలుగు వెర్షన్ మొదటి రోజు 5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. ఒక్క నైజాం ఏరియాలోనే కోటికి పైగా వసూళ్లని రాబట్టిందని టాక్. దాంతో ఇక్కడ కాంతార క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా హోంబలే సంస్థ నిర్మించిన ఈసినిమాను.. ప్రభాస్ రెండు సార్లు చూసినట్టు ప్రకటించి.. భారీ హైప్ క్రియేట్ చేశాడు. అలాగే స్వీటి అనుష్క కాంతారపై ప్రశంసల వర్షం కురిపించింది. దాంతో కాంతార భారీ వసూళ్లు అందుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.