టిప్పు సుల్తాన్ (Tipu Sultan)పై సినిమాను నిలిపివేస్తున్నట్లు నిర్మాత సందీప్ సింగ్ వెల్లడించారు.టిప్పు అభిమానుల నుండి తనకు, తన కుటుంబానికి, స్నేహితులకు బెదిరింపులు రావడమే ఇందుకు కారణమని తెలిపారు. టిప్పుసుల్తాన్ మూవీ నిలిపివేస్తున్నట్లు సోమవారం ట్విట్టర్(Twitter) వేదికగా ప్రకటించారు.’హజ్రత్ టిప్పు సుల్తాన్‌పై సినిమా తీయడం లేదు. నన్ను, నా కుటుంబాన్ని, నా స్నేహితులను బెదిరించడం లేదా దుర్భాషలాడడం ఇప్పటికైనా మానుకోవాలని నా తోటి సోదరీ, సోదరీమణులను కోరుతున్నాను. నేను ఉద్దేశపూర్వకంగా ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీసి ఉంటే నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఒక భారతీయుడిగా ప్రతి ఒక్కరి నమ్మకాలను నేను గౌరవిస్తాను. ఇక నుంచైనా ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుందాం’ అని సందీప్ సింగ్ (Sandeep Singh)పేర్కొన్నారు.పవన్ శర్మ దర్శకత్వంలో ‘టిప్పు సుల్తాన్’ చేస్తున్నట్లు నిర్మాత సందీప్ గతంలో ప్రకటించారు. ‘ఇది నేను వ్యక్తిగతం విశ్వసించి చేస్తున్న చిత్రం. నా సినిమాలు సత్యం వైపు నిలబడతాయి. చరిత్ర పుస్తకాల ద్వారా ఆయన్ను ఒక గొప్ప వీరుడిగా చిత్రించి మన బ్రెయిన్‌వాష్ చేశారు. కానీ, టిప్పు సుల్తాన్ గురించి ఎవరికీ తెలియని క్రూరమైన మరో పార్శ్వాన్ని మేము చూపించబోతున్నాం. భవిష్యత్ తరాల కోసం ఆయన చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తాం’ అని తెలిపారు. దర్శకుడు పవన్ శర్మ (director Pawan Sharma) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.