Viharikaతో హైపర్ ఆది ప్రేమ..? ఇది కూడా పబ్లిక్ స్టంటేనా?
హైపర్ ఆది లవర్ ఎవరో తెలిసిపోయింది. ఓ షోలో తనకు కాబోయే జీవిత భాగస్వామిని పరిచయం చేశాడు. అయితే ఇదీ స్టంట్ అని.. ఆ ప్రోగ్రాం హైప్ చేసిన ప్రోమో అని కొందరు అంటున్నారు.
హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ కామెడీ షోతో తన కెరీర్ ప్రారంభించి, సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. హైపర్ ఆది అంటే ఎవరికైనా గుర్తుకువచ్చేది పంచ్‌లు. ఎవరిమీదైనా గుక్క తిప్పుకోకుండా సెటైర్లు వేయగలడు. కరెంట్ ఎఫైర్స్ ఫాలో అవుతూ, వాటితో పంచులు వేస్తూ, పాపులారిటీ తెచ్చుకున్నాడు.
మెగా ఫ్యామిలీపై ఎప్పటికప్పుడు తన అభిమానం చూపిస్తూ ఉంటాడు. ఇటీవల భోళా శంకర్ ఈవెంట్లో చిరు, పవన్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు. హైపర్ ఆది ప్రేమలో పడ్డాడట. అమ్మాయిని తాజాగా ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అది కూడా బుల్లితెరపై ఓ ఈవెంట్లో కావడం విశేషం. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
గత కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పరిచయం చేస్తానంటూ స్టేజ్‌పైకి పిలిచాడు. ‘ఇప్పటివరకు కంటెంట్ కోసం చాలా మందికి లైన్ వేసినట్లు చెప్పాను. నిజంగా ప్రేమించింది ఒక అమ్మాయిని మాత్రమే. ఆమె ఇక్కడే ఉందంటూ ‘బేబీ ఒక్కసారి స్టేజ్‌పైకి రా’అని ఆది పిలవగా.. ఒక అమ్మాయితో నవ్వులు చిందిస్తూ స్టేజ్ మీదకు వచ్చింది. ఆ తర్వాత ఆది తనకు ‘ఐ లవ్ యూ విహారిక’ అంటూ ప్రపోజ్ చేశాడు. విహారిక కూడా ‘లవ్ యూ టూ ఆది’ అని చెప్పింది. అంతేకాదు ఇద్దరూ ఒకరి బుగ్గలను ఒకరు ముద్దాడారు. దీంతో షోలో ఉన్నవారంతా చప్పట్లు కొడుతూ ఆ జంటను ఆశీర్వదించారు.
ఇది నిజమే అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, లేదు, ఈటీవీ వాళ్లు ఇలాంటివి చాలా చేశారు. ఇది కూడా అందులో ఓ భాగమే. పబ్లిక్ స్టంట్ అని. స్క్రిప్ట్ లో భాగమే అలా చేయించారు అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం ఎపిసోడ్ వస్తే కానీ, ఈ విషయంలో క్లారిటీ రాదు.