Pankaj Udhas : ప్రముఖ గజల్ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూత
ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూశారు. తన స్వరంతో కోట్లాది హృదయాలను శాసించిన గొంతుక ఇప్పుడు మూగబోయింది. పంకజ్ ఉదాస్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడ్డారు.
Pankaj Udhas : ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూశారు. తన స్వరంతో కోట్లాది హృదయాలను శాసించిన గొంతుక ఇప్పుడు మూగబోయింది. పంకజ్ ఉదాస్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడ్డారు. క్యాన్సర్ కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. ఆయన మృతికి సంబంధించిన సమాచారాన్ని ఆయన కుమారుడు నయాబ్ ఉదాస్ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తెలియజేశారు. “దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఫిబ్రవరి 26న పద్మశ్రీ పంకజ్ ఉధాస్ కన్నుమూశారని ప్రకటించడం చాలా బాధాకరం” అని రాశారు.
ఆయన 1951 మే 17న గుజరాత్‌లోని జెట్‌పూర్‌లో జన్మించారు. తన ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడు. అతనికి ఐదేళ్ల వయసులోనే పాడటం పట్ల ఆసక్తి కలిగింది. అన్నయ్య సహకారంతో స్టేజ్‌పై ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించి తన గాత్రంతో ప్రజల మనసులను దోచుకోవడం ప్రారంభించాడు. 1962లో భారత్-చైనా యుద్ధ సమయంలో ఆయన స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వేదికపై ‘ఏ మేరే వతన్ కే లోగోన్’ పాట పాడారు. అతని వాయిస్‌కి జనాలు ముగ్ధమనోహరులైపోయారు. అప్పుడు గుంపులో నుండి ఒక వ్యక్తి వచ్చి అతనికి రూ.51 ఇచ్చాడు. పంకజ్ 1972లో ‘కామ్నా’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.