మరో రెండు రోజుల్లో మెగా స్టార్ ‘గాడ్ ఫాదర్’ థియేటర్లోకి రాబోతోంది. దాంతో ప్రమోషన్స్‌ను పరుగులు పెట్టిస్తోంది చిత్ర యూనిట్. తెలుగుతో పాటు హిందీలో కూడా గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్‌గానే గాడ్ ఫాదర్ హిందీ ట్రైలర్ లాంచ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించడంతో.. హిందీలో మంచి హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాలో సల్మాన్‌ను తీసుకోవడాని కారణం కూడా అదేనని చెప్పొచ్చు. అయితే రామ్ చరణ్ వల్లే గాడ్ ఫాదర్ సినిమా చేశానని.. సల్మాన్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చింది కూడా చరణేనని.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చారు మెగాస్టార్. సల్మాన్ కూడా చిరు పై అభిమానంతో పారితోషకం తీసుకోకుండా ఈ సినిమా చేశాడని టాక్. దాంతో సల్మాన్ కోసం చరణ్ కూడా అలాంటిదే ఏదైనా చేయాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే సల్మాన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో చరణ్ గెస్ట్ రోల్ చేశాడని గతంలోనే వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు సల్మాన్ ఖాన్. ముంబైలో జరిగిన గాడ్ ఫాదర్ ప్రెస్ మీట్లో.. చరణ్ గెస్ట్ రోల్ గురించి అడగ్గా.. ఒకింత ఆశ్చర్యంగా.. మీకెలా ఎలా తెలిసిందంటూ.. నిజమేనని చెప్పాడు. తాను వద్దని చెప్పినా.. చరణ్ పట్టుబట్టి మరీ.. తనతో పాటు వెంకటేష్‌తో కలిసి ఓ పాటలో స్టెప్పులేశాడని సెలవిచ్చాడు. మొత్తంగా రామ్ చరణ్.. సల్మాన్ రుణం అలా తీర్చుకున్నాడని చెప్పొచ్చు.