Nani : బలగం వేణు డైరెక్షన్లో నాని నెక్ట్స్ సినిమా
నేచురల్ స్టార్ నానీ నటించబోతున్న తదుపరి సినిమా బలగం వేణు దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ఈ సినిమాకి ‘ఎల్లమ్మ’ పేరు పెట్టినట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.
Nani Yellamma Movie: టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోంది. నేచురల్ స్టార్ నానీ నటిస్తున్న ఆ సినిమాని బలగం వేణు డైరెక్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. సినిమాకి ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ని ఖరారు చేసినట్లు తెలిపారు. నాని, వేణు కాంబినేషన్లో త్వరలో సినిమా రానుందని వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఎవరూ అధికారికంగా కన్ఫమ్ చేయలేదు.
అయితే గురువారం నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. లవ్ మి మూవీ టీజర్ లాంచ్ సందర్భంగా ఈ విషయాల్ని తెలియజేశారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. నాని, వేణు యెల్దండి మూవీ అప్డేట్ ఏంటి? అని అభిమాని దిల్ రాజును ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇస్తూ. ‘ఫైనల్ అయింది. ఎల్లమ్మ వస్తది’ అంటూ చెప్పుకొచ్చారు.
ఈ విషయం వినగానే అక్కడున్న ఫ్యాన్స్ అంతా గట్టిగా అరుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. టైటిల్ కూడా ఖరారు కావడంతో అభిమానులు ఆనందపడ్డారు. బలగం మూవీ డైరెక్టర్ వేణు డైరెక్షన్ లో తాను నటించాలని అనుకుంటన్నట్లు గతంలో ఓసారి నాని చెప్పాడు. అప్పటి నుంచీ వీళ్ల కాంబినేషన్ లో మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రొడ్యూసరే ఆ విషయాన్ని కన్ఫమ్ చేశారు. దీంతో ఇటీవల హాయ్ నాన్న మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నానీ తర్వాతి చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.