Ujjwala LPG Subsidy : కేంద్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజు ఓ శుభవార్త చెప్పింది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు వంట గ్యాస్‌పై ఇచ్చే రూ.300 సబ్సిడీని మరో ఏడాది అంటే 2024 – 2025 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించనున్నట్లు వెల్లడించింది. లోక్ సభ ఎన్నికలు ముందున్న వేళ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
గతంలో ఇచ్చిన సబ్సిడీ(Subsidy) గడువు ఈ నెల 31తో ముగుస్తుంది. దీంతో ఇప్పుడు కొత్తగా మరో ఏడాది సబ్సిడీని పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినేట్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మరికొన్ని నిర్ణయాలు సైతం జరిగాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని పీయూష్ గోయల్(Piyush Goyal) అన్నారు. అలాగే ప్రభుత్వ ఖజానాపై రూ.12 వేల కోట్ల ఆర్థిక భారం పడుతుందని చెప్పారు.
ఏడాదికి 12 సిలిండర్లకు మాత్రమే ఈ రాయతీ లభిస్తుందని మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా నిరు పేద మహిళకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ సదుపాయాన్ని కల్పించింది. 2022లో ఉజ్వల(Ujjwala) పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి ఒక్కో సిలిండర్‌కి రూ.200 సబ్సిడీ ప్రకటించింది. గత అక్టోబర్‌లో ఆ సబ్సిడీ మొత్తాన్ని రూ.300కి పెంచింది.