కొత్తవారిని పరిచయం చేయడం, కొత్త కథలకు పట్టం కట్టడం, తద్వారా ఘన విజయాలను, ధన విజయాలను సొంతం చేసుకోవడం ప్రముఖ నిర్మాత, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ తాజా చైర్మన్ దిల్‌రాజుకి కొత్తేం కాదు. ఆయన మొదటనుంచి నమ్మిన సిద్ధాంతం, దానికి కట్టుబడి, అమలు చేసిన విధానం సరికొత్త బంగారు లోకాన్ని ఆవిష్కరిస్తూనే ఉంది. ఎందరికో జీవితాన్ని ప్రసాదించిన దేవాలయం దిల్‌రాజు చిత్ర కార్యాలయం. తానేదైతే నమ్మి మొదటనుంచి భుజాలకెతుకున్నారో అదే ఇప్పుడు మరింత విస్తృతపరిచి, ఎక్కువమందికి అవకాశాలు కల్పించడానికే దిల్రాజుడ్రీమ్స్ అనే ప్రాజెక్టును ప్రారంభించారు. దీని ద్వారా ఎవ్వరైనా తమ కథలను దిల్‌రాజు డ్రీమ్స్ ప్రాజెక్టులో రిజిస్టర్ చేసుకోవచ్చు, దిల్‌రాజు సహయసహకారాలతో ఎదగొచ్చు. ఇదే దిల్‌రాజు స్లోగన్. కాకపోతే దీనికి కొత్తగా మళ్ళీ ఈ దిల్‌రాజు డ్రీమ్స్ అనే న్యూ ప్లాట్ ఫార్మ్ అవసరమా? అంటే దానికి దిల్‌రాజు తనదైన సమాధానం చెప్పారు. ‘’ ఇది నిజానికి డ్రీమ్స్ త్రూ దిల్‌రాజు కాన్సెప్ట్. అంటే ఎవరైనా దిల్‌రాజు ద్వారా తమ కలలను నెరవేర్చుకోవచ్చు. అది కేవలం సినిమాకి సంబంధించి మాత్రమే. దర్శకులు కావాలనుకున్నవారు, రచయితలుగా చిత్రపరిశ్రమలోకి ప్రవేశించాలనుకున్నవారు ఈ వేదికని విరివిగా వాడుకోవచ్చు’’ అని చెప్పారు.
అయితే ఈ మధ్యన చాలా మంది కథలు చెప్పిన తర్వాత వాళ్ళని బాగులేదు కథ అని వాటిని నిరాకరించి, అందులో ముఖ్యమైన, కీలకమైన పాయంట్స్ని తస్కరించి తమ సినిమాలలో వాడుకుంటున్న ప్రబుద్దులు ఎందరో తయారయ్యారు. సినిమాలో చూసుకునేవరకూ కూడా వారికి తమ పాయంట్ని అన్యాయంగా లాగేసుకున్నారనే విషయం కూడా తెలియని అభాగ్య, నూతన దర్శకులు అనేకమంది రోడ్లు పట్టి తిరుగుతున్నారు. వారి గొంతుకలు ఎవరికీ వినిపించడం లేదు. వాళ్ళూ వినిపించలేకపోతున్నారు. ఒంటరిగా కూర్చుని ఏడవడం తప్పితే వారికి గత్యంతరం లేని దురవస్థలో అనేకమంది కొట్టుమిట్టాడుతున్నారు తెలుగు చిత్రపరిశ్రమలో ఈనాడు. అటువంటివారందరికీ దిల్‌రాజు ఆశ్రయం ఒక సువర్ణావకాశం. చాలా నిజాయితీగా, కొత్త ప్రతిభని ప్రోత్సహించే పనిలో ఆదినుంచే నిమగ్నమై ఉన్న దిల్‌రాజు ఎంతో కథల విషయంలో పవిత్రంగా పవర్తించే ఉన్నత సంస్కారి దిల్‌రాజు. అందుకు ఆయన గతంలో తీసిన కళాఖండాలే నిదర్శనాలు.
ఎక్కడికెళ్ళాలో, వెళ్ళి ఎవరిని కలవాలో తెలియక, కథల సంచీని భుజాన వేసుకుని, గంపెడాశలతో చిత్రపరిశ్రమ ద్వారాలను దాటుతున్న ప్రతిభావంతులకి దిల్‌రాజు డ్రీమ్స్ ఒక పెద్ద గేట్ వే. దానికి సంబంధించి, చాలా పటిష్టమైన లీగల్ సిస్టమ్‌నీ, కోడ్‌ని కూడా దిల్‌రాజు అమలు చేయబోతున్నారు. ఎవ్వరూ తమ కథలను అపహరించలేని కట్టుదిట్టమైన వ్యవహారవిధానాన్ని, విధాననిర్ణయాలను దిల్‌రాజు తీర్చిదిద్దబోతున్నారు. ఇన్నాళ్ళ, ఇన్నేళ్ళ చిత్రపరిశ్రమలో ఇటువంటి ఒక వేదికని సృష్టించిన నిర్మాతగానీ, సంస్థగానీ లేనేలేదంటే అతిశయోక్తి కానేకాదు. చరిత్ర సాక్షిగా, దిల్‌రాజే కొత్తవారి పాలిట మనసున్న మారాజు. ఈ దిల్‌రాజు డ్రీమ్స్ ద్వారా ఎందరో ప్రతిభావంతులు బైటకు వచ్చి, చిత్రపరిశ్రమ మనుగడను తమ సృజనాత్మక నైపుణ్యంతో సుసంపన్నం చేస్తారని ఆశిద్దాం.