రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన వెంటనే ఎఫ్డిసిపైన కూడా దృష్టి సారించి. అన్ని రంగాలలో దమ్మున్న వ్యక్తిగా సినిమా పరిశ్రమలో దశాబ్దాలుగా పేరు పొంది, పరిశ్రమ తలలో నాలుకగా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు భుజస్కందాల పైన ఎఫ్డిసి పెనుబాధ్యతలను మోపారు. రేవంత్ రెడ్డి నిర్ణయం ముమ్మాటికీ కరెక్టే. దిల్ రాజుని మించిన కార్యదక్షత ఉన్న మొనగాడు, సినిమా పరిశ్రమలో అన్ని శాఖలలోనూ విస్తృతమైన అవగాహన, ఆకళింపూ రెండూ ఉన్న వ్యక్తిని వెతకడం అక్షరాలా కష్టమే.
మహారాణికి పురుడు పోయాలన్నా కూడా ఓ చెయ్య తిరిగిన మంత్రసాని కావాలి. పురిటిలో ప్రపంచాన్నేలే చక్రవర్తే పుట్టొచ్చు గాక. కానీ మంత్రసాని గొప్పతనాన్ని ఏమాత్రం తగ్గించలేం. ఇక్కడ ఆ గొప్ప మంత్రసాని అగ్ర నిర్మాత, తెలంగాణ ఎఫ్డిసి ఛైర్మన్ దిల్ రాజే కావడం కేవలం కాకతాళీయం మాత్రమే. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం దాదాపుగా ఎఎఫ్డిసి నిద్రపోయింది. అయన పూర్తిగా రాజకీయాలలో మునిగిపోయి కొంత, అధికార దర్పంతో కొంత, సినిమా పరిశ్రమ పట్ల నీరసభావంతో మరికొంత ఎఎఫ్డిసిని పూర్తిగా మూలన పడేశారు. చివరికి ఏదో మొక్కుబడిలా తనకి అత్యంత ఆప్తుడైన, నిర్మాత పుస్కూర్ రామ్మోహనరావుకి చైర్మన్ పదవిని కట్టబెట్టి, చేతులు దులుపేసుకున్నారు.
ఆయన దగ్గర సినిమావాళ్ళకే కాదు, మంత్రులకి కూడా ప్రవేశం ఉండని పరిస్థితే అనుకోండి. అది వేరే కథ. రామ్మోహనరావు కూడా ఏమంత మెచ్చుకోదగ్గ కార్యక్రమాలను తన హయాంలో నడపలేకపోయారు. అది కేవలం ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు వెళ్ళి ఏదీ మాట్లాడలేని అసక్తతే దానికి కారణం. అది ఆయన సన్నిహితులతో అన్నట్టుగా కూడా బోగట్టా.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన వెంటనే ఎఫ్డిసిపైన కూడా దృష్టి సారించి. అన్ని రంగాలలో దమ్మున్న వ్యక్తిగా సినిమా పరిశ్రమలో దశాబ్దాలుగా పేరు పొంది, పరిశ్రమ తలలో నాలుకగా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు భుజస్కందాల పైన ఎఫ్డిసి పెనుబాధ్యతలను మోపారు. రేవంత్ రెడ్డి నిర్ణయం ముమ్మాటికీ కరెక్టే. దిల్ రాజుని మించిన కార్యదక్షత ఉన్న మొనగాడు, సినిమా పరిశ్రమలో అన్ని శాఖలలోనూ విస్తృతమైన అవగాహన, ఆకళింపూ రెండూ ఉన్న వ్యక్తిని వెతకడం అక్షరాలా కష్టమే. ఎవడేమనుకున్నా సరే దిల్‌రాజుకి పోటీయే లేదు. అందుకే రేవంత్ రెడ్డికున్న అనుభవసారం దిల్‌రాజు ఎంపికలోనే కనపించింది.
ఎవడెంత బరువు మోయగల శక్తిని కలిగి ఉంటాడో, అంత బరువునూ అల్లా మోపుతాడని ముస్లిం పవిత్రగ్రంథం ఖురాన్లో చెప్పినట్టుగా దిల్‌రాజు చైర్మన్ పదవీ బాధ్యతలు చేపట్టి ఎంతో కాలం గడవనే లేదు. అల్లు అర్జున్ గొడవ ప్రారంభమైపోయింది. అల్లు వారబ్బాయి, ఐకాన్ స్టారే కావచ్చు, కానీ ప్రభుత్వ బంధనాల నుంచీ తప్పించుకోలేకపోయాడు. జీవితం సినిమా కాదని అల్లు అర్జున్‌కి తెలిసి వచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం పావులు కదిపింది. చిరంజీవిగారి పుణ్యమా అని అల్లు అర్జున్‌కి బెయిల్ దొరికిందని కొందరు చెప్పుకుని చంకలు చరుచుకున్నా సరే, తెర వెనుక శ్రీకృష్ణుడి పాత్రను పోషించింది మాత్రం దిల్ రాజేనని అధికార వర్గాలే బాహాటంగా మాట్లాడాయి. దిల్ రాజే గనక లేకుంటే అల్లు అర్జున్‌కి శంకరగిరి మాన్యాలేనని ఘంటాపథంగా చెప్పినవాళ్ళు కూడా ఉన్నారు. అది నిజం కూడా.
అదంత చిన్న విషయం కాదు. పబ్లిక్‌గా జరిగిన తప్పిదం నుంచి ఎంతటి గొప్పవాడినైనా రక్షించాలంటే మామ్మూలు దమ్ములు సరిపోవు. అవి తనకున్నాయని దిల్‌రాజు నిరూపించుకుని పరిశ్రమ ప్రతిష్టని సంరక్షించిన వ్యక్తిగా తన పేరుని చరిత్ర పేజీల మీద సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. దాని వల్ల దిల్రాజుకొ ఒరిగిందేం లేదు. తన వ్యాపారం తనది. తన లాభనష్టాల గొడవ తనది.
తర్వాత ఈ గద్దర అవార్డుల తంతు. అవార్డులు ఇవ్వడం లేదని ఏనాటి నుంచో పరిశ్రమలో గందరగోళం చెలరేగుతూనే ఉంది. కానీ వినే నాధుడు లేడు. విన్నా చెయ్యగలిగిన సమర్ధుడూ లేడు. 14 ఏళ్లు గడిచిపోయాయి చూస్తుండగానే. అది మళ్ళీ దిల్‌రాజు కార్యనైపుణ్యశీలత వల్లనే సాధ్యమైందని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. 14 ఏళ్ళలో వచ్చిన సినిమాలను చూసి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించడం కన్నా అడవిలోకి వెళ్ళి ముక్కు మూసుకుని కూర్చోవడం ఉత్తమం. అటువంటి అసాధ్యమైన విషయాన్ని కూడా సుసాధ్యం చేసి చూపించిన ఘనత దిల్‌రాజుది. నిజాయితీగా ఆయన నిర్వర్తించాల్సిన విద్యుక్త ధర్మాన్ని ఆయన నిర్వర్తించారు. గద్దర్ అవార్డులను ఘనంగా నిర్వహించడానికి రేయింబవళ్లు శ్రమించారు.
కానీ, ఇక్కడే అపశ్రుతి. రావాల్సినవారు రాలేదు. ఇదిగో ఇలాటివే ప్రభుత్వాలను కిర్రెక్కించేవి. ఇన్నాళ్ళ బట్టి జరుగుతున్న వ్యవహారం కదా ఇది. ఆ మాత్రం వీలు చేసుకుని రాలేరా? ఏమంత రాచకార్యాలున్నాయని? మనవాళ్ళు ఒట్టి వెథవాయిలోయ్ అని గురజాడ అప్పారావు గారన్నట్టుగా, ఇంత కష్టపడి పరిశ్రమలోని కళాకారులను గౌరవించే సందర్భాన్ని అతికష్టం మీద జరిపిస్తుంటే దిల్‌రాజుకి వత్తాసుగానైనా రావాలి కదా. అది మినిమమ్ కర్టెసీ. దాన్ని సైతం పక్కన సునాయాసంగా పడేశారు. ఇంకోసారి ఏదైనా కష్టమొస్తే దిల్‌రాజు పలుకుతారా? ఎగేసుకుని వచ్చి అడ్డు పడతారా? ఆయన సరళంగా ప్రెస్మీట్లో ముక్తసరిగానే చెప్పి ఉండొచ్చు. కానీ దిల్‌రాజు మనసులో ఎంత బాధపడ్డారో చాలామందికి తెలుసు. ఇక్కడ కాకపోతే కనీసం ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అవార్డుల కార్యక్రమానికైనా వెళ్ళండి అని ఆయనెందకు చెప్పాల్సి వచ్చింది అని ఓ క్షణం ఆలోచిస్తే అందులో అంతరార్ధం అర్ధమవుతుంది.