Expiry Date : ఏంటీ.. వీటికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుందా?
మనం సాధారణంగా మందులు, ప్యాక్డ్ ఐటెంల లాంటి వాటికి ఎక్స్పైరీ డేట్‌ని చెక్ చేసుకుంటూ ఉంటాం. అయితే మనం వాడే పరుపులు, తలగడలు, కటింగ్ ప్యాడ్ల లాంటి వాటికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుందట. ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం మరి.
Expiry Date for Household Items : మనం రోజు వారీ జీవితంలో రకరకాల వస్తువులను వాడుతుంటాం. టానిక్‌లు, ట్యాబ్లెట్ల లాంటి వాటికైతే కచ్చితంగా ఎక్స్పైరీ డేట్‌ని చెక్ చేసుకుంటూ ఉంటాం. అయితే మనం నిత్య జీవితంలో వాడే ప్లాస్టిక్ డబ్బాలు, కటింగ్ ప్యాడ్లు, పరుపుల్లాంటి వాటిని ఒకసారి కొనుక్కుంటే అవి పోయే వరకు వాడుతూనే ఉంటాం. కానీ అది ఎంత మాత్రమూ సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటికీ ఎక్స్పైరీ డేట్(EXPIRY DATE ) ఉంటుందంటున్నారు. మరి దాన్ని ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సోఫాల కింద చాలా మంది కార్పెట్లను వాడుతుంటారు. ఎప్పుడో ఒకసారి వాటిని క్లీన్ చేస్తుంటారు. చాలా సార్లు దాన్ని దుమ్ము దులిపి, ఎండలో వేసి ఆరబెట్టి మళ్లీ వాడుకుంటూ ఉంటారు. అయితే అది ఎంత మాత్రమూ సరైన పద్ధతి కాదు. దాన్ని తరచుగా వాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేయాల్సిందే. మంచి నాణ్యమైన కార్పెట్(carpet) అయినా సరే ఐదారేళ్లకు మించి దాన్ని వాడకూడదు. అందువల్ల అలర్జీలు, శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి.
మంచాలపై వేసుకునే పరుపును(bed) ఒకసారి కొన్నారంటే ఇక దాని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అలా ఏళ్ల తరబడి వాడుతూనే ఉంటారు. అయితే ఎక్కువ సంవత్సరాల పాటు దాన్ని అలా వాడుతూ ఉండటం వల్ల మనకు తెలియకుండానే దానిలోకి భారీగా బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి లాంటివి చేరిపోతాయి. అందుకనే దీన్ని గరిష్ఠంగా ఏడు నుంచి పది సంవత్సరాలు మాత్రమే వాడుకోవాలి.
వంటింట్లో కూరగాయలు కట్ చేసుకునేందుకు మనం కటింగ్ ప్యాడ్లను వాడుతుంటాం. కూరగాయల్ని కట్ చేసేప్పుడు వీటిపై గాట్లు ఏర్పడతాయి. వాటిలో బ్యాక్టీరియాలు పెరిగేందుకు అనువుగా ఉంటుంది. అందుకే వాటిని కచ్చితంగా రెండేళ్లకోసారి మారుస్తూ ఉండాలి. అలాగే వంటింటి సర్ఫేస్‌లను శుభ్రం చేసేందుకు వాడే కిచెన్ న్యాప్కిన్లు, స్పాంజ్‌లను రెండు, మూడు వారాలకు మించి వాడకూడదు. ఇంకా ఎంత మంచి బ్రాండెడ్ నాన్‌స్టిక్ కుక్ వేర్ని కొనుక్కున్నా మూడు నుంచి ఐదు సంవత్సరాలు మాత్రమే వాటిని వాడాలి. అంతకంటే ఎక్కువ రోజులు వాడితే వాటి నుంచి వచ్చే హానికారక రసాయనాలు ఆహారంలోనూ విడుదల అవుతాయి.