టర్కీ, సిరియా భూకంపం నేపథ్యంలో మరణాల సంఖ్య 50,000 దాటవచ్చునని ఐక్య రాజ్య సమితి రిలీఫ్ చీఫ్ మార్టిన్ గ్రిఫిట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే మృతుల సంఖ్య 28000 దాటిన విషయం తెలిసిందే. అయితే ఎంతమంది మరణించారనే, ఎంతమంది బాధితులు ఉన్నారు.. అనే విషయాన్ని అప్పుడే అంచనా వేయలేమని చెప్పారు. కానీ ప్రస్తుతం వెలుగు చూసిన మరణలతో పోలిస్తే రెండింతలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చునని చెప్పారు. ఇప్పుడు వచ్చింది అసలైన సంఖ్య కాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం టర్కీలో 25,000 మంది వరకు, సిరియాలో 3,500 వరకు మృత్యువాత పడ్డట్లు ఉన్నాయి. కానీ అంతకంటే రెండింతలు ఉండవచ్చునని మార్టిన్ చెప్పారు. అంతకుముందు ఐక్య రాజ్య సమితి స్పందిస్తూ… భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు తొమ్మిది లక్షల మందికి అత్యవసరంగా ఫుడ్ అవసరమని, కేవలం సిరియాలోని 55 లక్షల మందికి ఉండడానికి ఇల్లు కూడా లేకుండా అయినట్లు పేర్కొన్నది. రెండు దేశాల్లో రెండున్నర కోట్ల మంది పైన తీవ్ర ప్రభావం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాలకు ఇప్పటికీ ఇప్పుడు 43 మిలియన్ డాలర్ల సహాయం అవసరం అని చెప్పింది. కేవలం టర్కీలోనే ఆ దేశానికి చెందిన 32 వేల మంది సిబ్బందితో పాటు, ఇతర దేశాలకు చెందిన 8 వేల మందికి పైగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
టర్కీలోని హాతిలో 128 గంటల తర్వాత రెండు నెలల పాపను రక్షించింది రెస్క్యూ సిబ్బంది. సిబ్బంది ఎంతో మంది చిన్నారులు సహా కాపాడుతోంది. అంతకు ముందు అప్పుడే పుట్టిన చిన్నారిని ప్రాణాలతో బయటకు తీశారు. గడ్డకట్టే చలిని కూడా లెక్క చేయకుండా సిబ్బంది అహర్నిశలు పని చేస్తోంది.
శిథిలాల కింద 10రోజుల పసికందు
శిథిలాల మధ్యలో ఓ పది రోజుల పసికందు బతికి బయటపడింది. 90 గంటల పాటు జీవన్మరణ పోరాటం చేసి గెలిచింది. భూకంపం ధాటికి టర్కీ, సిరియాలో నేలకూలిన బిల్డింగ్ శిథిలాల కింద ఎందరో ప్రాణాలను కోల్పోతున్నారు. భూకంప శిథిలాల కింద కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఓ బిల్డింగ్ శిథిలాల కింది నుంచి పది రోజుల పసికందును.. తల్లితో సహా రెస్క్యూ సిబ్బంది రక్షించారు. శిథిలాల్లో చిక్కుకున్న తర్వాత 90 గంటలకు ఆ తల్లీబిడ్డలు క్షేమంగా బయటపడ్డారు.
సహాయక చర్యలు చేపట్టిన సిబ్బందికి పిల్లాడి ఏడుపు వినిపించడంతో అలర్టయ్యారు. జాగ్రత్తగా శిథిలాలను తొలగిస్తూ పసికందు దగ్గరికి చేరుకున్నారు. బాబుతో పాటు తల్లిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దాదాపు నాలుగు రోజులు చిక్కుకుపోయిన తల్లీబిడ్డలను వెంటనే హాస్పిటల్లో తరలించారు. బాబు చురుగ్గానే ఉన్నప్పటికీ తల్లి మాత్రం తిండి, నీరు లేక నీరసించిపోయింది.