»Tensions Between India And Canada Heavily Increased Air Fares
India Vs Canada: భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు..భారీగా పెరిగిన విమాన ఛార్జీలు
భారత్, కెనడాల మధ్య విమాన ప్రయాణాలు పెరిగాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విమానం టికెట్ల రేట్లు అమాంతం పెరిగాయని ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడించాయి.
భారత్-కెనడా మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కెనడాలోని ఇండియన్స్ జాగ్రత్తగా ఉండాలని భారత్ ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు కెనడా వాసుల వీసా దరఖాస్తుల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. కెనడాలోని భారత హైకమిషనర్, కాన్సులేట్లకు బెదిరింపులు వస్తున్నట్లుగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
కెనడాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, అయితే ఇప్పుడు భద్రత విషయం గురించి మాట్లాడడం సరికాదని అరిందమ్ బాగ్చి అన్నారు. భారత వ్యతిరేక శక్తులకు కెనడా ఒక కేంద్రంగా మారిందని, వారికి కెనడా ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయ విచారణ ఎదుర్కొనేందుకు వారిని భారత్కు పంపాలని బాగ్చి కోరారు.
భారత్ కెనడాల మధ్య ఉద్రిక్తతల నడుమ విమాన ప్రయాణాలు పెరిగాయి. ఈ తరుణంలో విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదం కారణంగా చాలా మంది భారత్కు వచ్చేస్తున్నారు. దీంతో భారత్, కెనడా దేశాల మధ్య విమాన టికెట్ ధరలు 25 శాతానికి పైగా పెరిగాయని ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడించాయి.