Ayodhya Ram Darshan : అయోధ్య ఆలయంలో మధ్యాహ్నం గంటపాటు దర్శనానికి బ్రేక్
అయోధ్యలో బాల రాముడి దర్శనానికి రోజూ గంట పాటు విరామం ఇవ్వాలని శ్రీరామ జన్మ భూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయించింది. రామయ్య దర్శనానికి భక్త జనం రద్దీ ఏ మాత్రం తగ్గని నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. వివరాల్లోకి వెళితే....
Ayodhya Ram Darshan Break Time : అయోధ్య రామ మందిరం తెరిచి ఇన్ని రోజులు గుడుస్తున్నా భక్తుల సంఖ్యలో మాత్రం మార్పు రావడం లేదు. అంతే రద్దీగా ఆ మందిరానికి భక్తులు పోటెత్తుతున్నారను. దేశ విదేశాల నుంచి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. పండుగలు, సెలవుల్లో అయితే జనాల తాకిడి మరీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆలయ దర్శనానికి రోజూ గంట పాటు బ్రేక్ ఇవ్వాలని శ్రీరామ జన్మ భూమి తీర్థ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.
రోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంట వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తామని ట్రస్ట్ అధికారులు చెప్పారు. ఈ విషయమై ఆలయ ముఖ్య పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడారు. ‘అయోధ్య(Ayodhya) గుడిలో కొలువున్న రాముడు బాల రాముడు. అలా ఎప్పుడూ భక్తులకు దర్శనమిస్తూ ఉండాలంటే ఆ ఒత్తిడికి ఆయన తట్టుకోలేరు. బాల రాముడికి కాస్త విశ్రాంతి ఇచ్చేందుకే రోజూ గంట సేపు గుడి తలుపులు మూసి ఉంచాలని ట్రస్ట్ నిర్ణయించింది’. అంటూ చెప్పుకొచ్చారు.
ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ గత నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగా జరిగింది. ఆ తర్వాత నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని రోజూ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తుల దర్శనార్థం గుడి తలుపులను తెరిచి ఉంచుతున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం మరో గంట సేపు అదనంగా దర్శనానికి బ్రేక్ ఇస్తున్నారు.