RRR : బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నారు.. అనేది ఎవరికి అంతుబట్టలేదు. అసలు జక్కన్నకు కూడా తెలియకపోవచ్చు.. బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసిన తాను.. నెక్స్ట్ ఆస్కార్ స్థాయికి వెళ్తానని..
బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నారు.. అనేది ఎవరికి అంతుబట్టలేదు. అసలు జక్కన్నకు కూడా తెలియకపోవచ్చు.. బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసిన తాను.. నెక్స్ట్ ఆస్కార్ స్థాయికి వెళ్తానని.. కానీ ఊహించని విధంగా ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించాడు దర్శక ధీరుడు. బాహుబలి తర్వాత రాజమౌళి, రామారావు, రామ్ చరణ్.. ఈ ముగ్గురు పేర్లు కలిసేలా ఆర్ఆర్ఆర్ అంటూ భారీ ప్రాజెక్ట్ ప్రకటించాడు రాజమౌళి. దీనిపై పై మొదట్లో కొన్ని విమర్శలు వచ్చాయి. అసలు ఈ పేరేంటి.. అని పెదవి విరిచిన వారు ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ ఆడియెన్స్‌కు తెగ నచ్చడంతో.. దాన్నే టైటిల్‌గా పెట్టేశాడు. దానికి Rise Roar Revolt.. అంటే రౌద్రం-రణం-రుధిరం అంటూ వివరణ ఇచ్చాడు. ఇక ఈ సినిమా విడుదలయ్యాక ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. కేవలం సంచలనాలకే ఆర్ఆర్ఆర్ పరిమితం కాలేదు.. తన పేరిట హిస్టరీ క్రియేట్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటునాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించింది. ఆస్కార్ వేదికపై ఎంఎం కీరవాణి, చంద్రబోస్ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా కీరవాణి మాటలు మరిచి పాటరూపంలో తన సంతోషాన్ని వ్యక్త పరిచారు. ఇక లిరిసిస్ట్ చంద్రబోస్ పట్టలేని ఆనందంతో ‘నమస్తే’ అంటూ.. ప్రతి ఒక్క తెలుగోడికి గూస్ బంప్స్ తెప్పించేశాడు. దీంతో ఆర్ఆర్ఆర్ టీం పై సినీ ప్రముఖులు, రాజకీయ నేతలతో పాటు ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు. పీఎం, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్, మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్ అనే కాదు.. ప్రతి ఒక్కరు ట్రిపుల్ ఆర్ టీంను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ ద్వారా ఇండియాకు మరో ఆస్కార్ అవార్డు దక్కింది. మొత్తంగా ఇండియాకు రెండు ఆస్కార్స్ దక్కడంతో.. సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా.. ఆర్ఆర్ఆర్ ఓ అద్భుతం.