టర్కీ, సిరియాలలో భారీ భూకంపం కారణంగా వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎన్నోవేల మందికి గాయాలయ్యాయి. భూకంపం దాటికి ఈ దేశాలు కకావికలమయ్యాయి. భవనాలు కుప్పకూలాయి. ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు, చనిపోయినవారిని తీసేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. కూలిపోయిన భవనాల కింద వేలాదిమంది ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోను పలువురు చిన్నారులు కొన్ని గంటల పాటు శిథిలాల కింద ఉన్నప్పటికీ బతికి బట్టకట్టారు. సిరియాలో ఈ అద్భుతం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారులను రెస్క్యూ టీమ్ రక్షించింది. ఒకే పట్టణంలో రెండు వేర్వేరు భవన శిథిలాల నుండి సురక్షితంగా బయటకు తీశారు. అంతేకాదు, మరో మిరాకిల్ బేబీ కూడా జన్మించింది.
రెస్క్యూ టీమ్ శిథిలాలను తొలగిస్తుండగా నవజాత శిశువు కనిపించింది. షాక్కు గురైన సహాయక సిబ్బంది వెంటనే ఆ శిశువును ఆసుపత్రికి తరలించింది. కానీ చిన్నారి తల్లిదండ్రులు మాత్రం శిథిలాల కిందపడి చనిపోయారు. భూకంపం సమయంలోనే ఆ తల్లికి ప్రసవం జరిగి, శిశువు జన్మించినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటన సిరియాలోని అలెప్పో నగరంలో జరిగింది. భూకంపం దాటికి కుప్పకూలుతున్న భవనాల వీడియోలు భయానికి గురి చేస్తున్నాయి. నగరాలు స్మశానాన్ని తలపిస్తున్నాయి.