Israel Palestine War: ఎటు చూసినా శవాలే.. ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 1400 మంది, గాజాలో 3785 మంది మృతి
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ లో కూడా సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒకటి రెండు కాదు మూడు ఫ్రంట్లు ఒక్కటయ్యాయి.
Israel Palestine War: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ లో కూడా సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒకటి రెండు కాదు మూడు ఫ్రంట్లు ఒక్కటయ్యాయి. ఒకవైపు గాజా నుంచి హమాస్ దాడి చేస్తుంటే మరోవైపు లెబనాన్ సరిహద్దు నుంచి హిజ్బుల్లా నిరంతరం దాడులు చేస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ సరికొత్త శత్రువు హౌతీ రెబల్స్ కూడా రంగంలోకి దిగింది. హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశారు. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ మూడు వైపుల నుంచి యుద్ధం చేయాల్సి ఉంది. ఈ భీకర యుద్ధం అక్టోబర్ 7న మొదలైంది. అంతకుముందు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై ఏకకాలంలో 5 వేలకు పైగా రాకెట్లను ప్రయోగించగా, ఆ తర్వాత ఇజ్రాయెల్ సైన్యం ప్రతీకారం తీర్చుకుని గాజా స్ట్రిప్‌లో విధ్వంసం సృష్టించింది.
ఈ క్రమంలో హమాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇప్పటివరకు 3,785 మంది పాలస్తీనియన్లు మరణించారని, 12,500 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. ఇజ్రాయెట్లో 1,400 మందికి పైగా మరణించారు. 206 మందిని హమాస్ బందీలుగా చేసి గాజాలో ఉంచినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి తెలిపారు. ఈ క్రమంలోనే అమెరికా నేరుగా యుద్ధంలోకి ప్రవేశించింది. అయితే, ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ కోసం పూర్తి సన్నాహాలను చేస్తున్నట్లు వెల్లడించింది. వందలాది ట్యాంకులు, సాయుధ వాహనాలు రెడీగా ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాల నుండి స్పష్టమవుతోంది, అవి ఎప్పుడైనా గాజాలోకి ప్రవేశించవచ్చు. దక్షిణ గాజా స్ట్రిప్‌లోని హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం వైమానిక దాడులు రాత్రిపూట కొనసాగాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గైడెడ్ బాంబులతో వేగంగా దాడి చేశాయి. ఈ క్రమంలో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ దాడుల్లో హమాస్ నౌకాదళ శాఖకు చెందిన ప్రత్యేక దళాల కమాండర్ మరణించినట్లు పేర్కొన్నారు. మరణించిన కమాండర్ అక్టోబర్ 7 దాడిలో పాల్గొన్నాడు.
గత రాత్రి హమాస్ జరిపిన భయానక దాడితో సెంట్రల్ ఇజ్రాయెల్ వణికిపోయింది. బీర్ షెవాలో హమాస్ అనేక రాకెట్లను ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగించింది. హమాస్ దాడి కారణంగా అనేక చోట్ల పేలుడు తర్వాత గాలిలో పొగలు కమ్ముకున్నాయి. తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇజ్రాయెల్ సైన్యాన్ని హమాస్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని తుల్కర్మ్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ( IDF)కి హమాస్ పెద్ద దెబ్బ వేసింది. దాని రహస్య స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని హమాస్ యోధులు రాకెట్లతో దాడి చేశారు. నూర్ షామ్స్ క్యాంపులో భారీ పేలుడు సంభవించింది. ఈ దాడిలో 10 మంది ఇజ్రాయెల్ సైనికులు గాయపడినట్లు ఇజ్రాయెల్ మీడియా ఒక వీడియోను విడుదల చేసింది.