China experiment: మరో ప్రమాదకర వైరస్‌పై చైనా ప్రయోగం.. డెత్ రేటు వంద శాతమట
ప్రపంచం ఇప్పుడిప్పుడే కరోనా భయం నుంచి కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో మరో వార్త ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. కొవిడ్-19 ను చైనాలో తయారు చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. అందులో నిజం ఎంత ఉందో ఇప్పటి వరకు తెలియలేదు. తాజాగా దీనికి మించిన ప్రమాదకరమైన వైరస్‌ను చైనా తయారు చేస్తుందని అంతర్జాతీయ కథనాలు వెలువడుతున్నాయి.
China experiment: కరోనా(Corona) మహామ్మారి చేసిన కల్లోలం అంతాఇంతా కాదు. ఇప్పటికీ కొవిడ్(Covid-19) పరిస్థితులను తలుచుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులను మరిచిపోతున్నారు. ఈ సమయంలో మరో వార్త ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కొవిడ్-19(Covid-19) కు మించిన ప్రమాదకరమైన వైరస్‌ను చైనా తయారుచేస్తోందని అంతర్జాతీయ కథనాలు వెలువడుతున్నాయి. అయితే చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వెలువడిందని అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ డ్రాగన్ దేశం మాత్రం దీన్ని కొట్టిపడేస్తోంది. ఈ సారి వస్తున్న వైరస్ అత్యంత ప్రమాదకరమైనదనీ, దీని మరణాల రేటు 100 శాతం ఉంటుందని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
వుహాన్‌లో జరిపిన ఓ అధ్యయనం ఈ విషయం బయటపడినట్లు తెలుస్తోంది. SARS-CoV-2కు చెందిన GX_P2V అనే వైరస్‌పై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. 2017లో వచ్చిన SARS-CoV-2 రకమైన వైరస్ జీఎక్స్ వైరస్ మరింత ప్రమాదకరంగా పని చేస్తొందని, గతంలో దీన్ని మలేషియన్ పాంగోలిన్స్ జంతువుల్లో గుర్తించారని తెలుస్తోంది. ఈ వైరస్‌ను శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగించారట. వాటిపై ఈ వైరస్ దారుణమైన ప్రభావం చూపించిందని, ఎనిమిది రోజుల్లోనే ఎలుకలన్నీ మరణించాయని ఆ అధ్యయనం పేర్కొంది. ఈ వైరస్ కారణంగా ఎలుకల ఊపిరితిత్తులు, ఎముకలు, కళ్లు, మెదడు దెబ్బతిన్నాయని వెల్లడించింది. బరువు తగ్గి బలహీనంగా మారడం మాత్రమే కాదు కొన్ని రోజుల్లోనే కనీసం నడవలేని స్థితికి మారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్లు అధ్యయనంలో వెల్లడించారు. ఇలాంటి వైరస్ మనుషులకు వ్యాపిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందనేది తెలియదు, కానీ ఇది చాలా ప్రదమాదకరమైన వైరస్ అని మాత్రం అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి.