»Australia Goodbye To Golden Visa Will It Affect India
Australia: గోల్డెన్ వీసాకు గుడ్‌బై.. భారత్‌పై ప్రభావం పడనుందా?
ఆస్ట్రేలియా ప్రభుత్వం గోల్డెన్ వీసా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడులకు కీలకమైన గోల్డెన్ వీసాల జారీని రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది.
Australia: ఆస్ట్రేలియా ప్రభుత్వం గోల్డెన్ వీసా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడులకు కీలకమైన గోల్డెన్ వీసాల జారీని రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. గోల్డెన్ వీసా ఆశించిన ఆర్థిక ఫలితాలను ఇవ్వట్లేదని ఆస్ట్రేలియా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని స్థానంలో వృత్తి నిపుణులకు ఇచ్చే వీసాలను పెంచనున్నట్లు తెలిపింది. అక్కడి గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దాదాపు లక్ష మంది ఈ ప్రోగ్రామ్ కింద ఆసీస్‌లో రెసిడెన్సీ దక్కించుకున్నారు.
ఇందులో 85 శాతం చైనా మిలియనీర్లే ఉన్నారు. కొన్నేళ్ల నుంచి ఈ స్కీమ్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ వీసా ద్వారా కొందరు విదేశీయులు అక్రమ సంపదను తరలిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో వీటి జారీని రద్దు చేస్తున్నట్లు హోంమంత్రి క్లేర్ ఓ నీల్ తెలిపారు. వీటి స్థానంలో వృత్తి నిపుణులకు మరిన్ని ఎక్కువ వీసాలు జారీ చేయడంపై దృష్టి సారించనున్నారని తెలిపారు. కెనడా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాలు కూడా ఈ తరహా వీసా స్కీమ్‌లను రద్దు చేశాయి.
అసలు గోల్డెన్ వీసా అంటే?
విదేశాలకు చెందిన సంపన్న పెట్టుబడిదారులు కొన్నేళ్ల పాటు ఆసీస్‌లో నివసించేందుకు వీలుగా ఈ గోల్డెన్ వీసాలను జారీ చేస్తుంటారు. అక్కడి నిబంధనల ప్రకారం కనీసం 5 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేవాళ్లు ఈ వీసాతో అయిదేళ్ల పాటు ఆస్ట్రేలియాలో ఉండవచ్చు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు 2012లో ఆస్ట్రేలియా ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.