సూడాన్‌లో ఆర్మీ, పారా మిలటరీ బలగాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులు చేసుకుంటున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ ఇళ్లకే పరిమిత మయ్యారు. శనివారం (Saturday)సూడాన్ రాజధానిలో సైనిక, బలగాల పేలుళ్లు, కాల్పులతో దద్దరిల్లిపోయింది.
Sudan: సూడాన్‌లో ఆర్మీ, పారా మిలటరీ బలగాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులు చేసుకుంటున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ ఇళ్లకే పరిమిత మయ్యారు. శనివారం (Saturday)సూడాన్ రాజధానిలో సైనిక, బలగాల పేలుళ్లు, కాల్పులతో దద్దరిల్లిపోయింది. తాజాగా, అక్కడ పరిస్థితి మరింత కల్లోలంగా మారింది. పలుచోట్ల జరిగిన ఘటనల్లో 27 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు. వైమానికి దాడులకు తెగబడటంతో ఖార్టూమ్ విమానాశ్రయం(Khartoum Airport)తో పాటు చుట్టు పక్కల భవనాలు మంటలు, నల్లటి పొగలు కమ్ముకున్నాయి. అక్కడి సామాన్య ప్రజలతో పాటు విమానాశ్రయంలో ప్రయాణికులు సైతం బాంబుల మోతను తట్టుకోలేక ప్రాణాలను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియోలు ట్విట్టర్(Twitter)లో వైరల్ అవుతున్నాయి.
దశాబ్దానికిపైగా సూడాన్‌లో సైన్యం, శక్తిమంతమైన పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజా దాడుల నేపథ్యంలో సూడాన్‌లోని భారతీయుల భద్రతకు సంబంధించి అక్కడ భారత రాయబార కార్యాలయం(ఎంబసీ) కీలక ప్రకటన చేసింది. భారతీయులు ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని సూచించింది. తదుపరి ప్రకటన చేసేవరకూ దయచేసి ప్రశాంతంగా ఉండాలని స్పష్టం చేసింది. పారా మిలటరీ ‘ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్’(rapid support force)ను సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదన అగ్నికి ఆజ్యం పోసింది. ఇది ఆర్మీ-పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఈ అంశంపై సైన్యాధినేత అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్, పారా మిలటరీ కమాండర్ మహ్మద్ హందాన్ డగ్లో మధ్య కొన్ని వారాలుగా నెలకున్న విభేదాలు ఇప్పుడు తీరాస్థాయికి చేరాయి.