Rameswaram Cafe Blast Suspect : బెంగళూరులో శుక్రవారం మధ్యాహ్నం రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడుకు సంబంధించిన దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇది బాబు పేలుడేనని తేల్చిన వారు అనుమానితుడి ఫోటోను సైతం విడుదల చేశారు. పేలుడుకు ముందు తర్వాత కూడా నిందితుడు వైట్ ఫీల్డ్‌లోని మారత్ గ్రామ పరిసరాల్లో తిరిగినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఎనిమిది బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఓ వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం రామేశ్వరం కేఫ్( Rameswaram Cafe)లోకి వచ్చాడు. అతడు కూడా ఒక బ్యాగును కూడా తీసుకుని వచ్చాడు. దానిలో టైమర్ బాంబ్ ఉంది. ఇడ్లీ తిన్న అతడు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ బాంబును పేల్చాడు. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ముందు గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ఈ ఘటన జరిగిందని భావించారు. తర్వాత పోలీసుల దర్యాప్తులో బ్యాగు నుంచి పేలుడు వచ్చినట్లు గుర్తించారు. దీంతో ఇది బాంబు పేలుడు(bomb blast)గా నిర్ధారణ అయ్యింది.
బెంగళూరులోని (bengaluru) ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ అధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఘటనలో ఎలాంటి బాంబును వాడి ఉంటారన్న దిశగానూ పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఘటన జరిగిన తర్వాత శుక్రవారమే కర్ణటక సీఎం, డిప్యూటీ సీఎంలు ఆ స్థలానికి చేరుకుని పరిశీలించారు. నివేదికలు వచ్చిన తర్వాత నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని సీఎం సిద్ధరామయ్య అన్నారు.