Three Workers dead in Manhole : హైదరాబాదు నగరంలో ఓ విషాధ సంఘటన చోటు చేసుకుంది. మ్యాన్ హోల్లో మరమ్మతుల కోసం దిగిన ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడిని కాపాడటానికి మరో ఇద్దరు మ్యాన్ హోల్లోకి దిగారు. అక్కడి విష వాయువుల్ని పీల్చిన ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరొక వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ ఘటన శుక్రవారం కుల్సుంపుర వద్ద ఉన్న మ్యాన్ హోల్(Manhole)లో జరిగింది. మొదట ఓ 40 ఏళ్ల కార్మికుడు మ్యాన్‌హోల్ లోపలికి వెళ్లాడు. తర్వాత అక్కడే కుప్ప కూలిపోయాడు. అతడిని రక్షించేందుకు బయట ఉన్న మరో ఇద్దరు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారూ లోపలికి వెళ్లారు. ఆ ఇద్దరూ కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. డీఆర్ఎఫ్ సిబ్బంది ఇద్దరి మృత దేహాలను వెలికి తీశారు. ప్రమాదకర స్థితిలో ఉన్న మరొకరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి కూడా మరణించాడు. మృతులను శ్రీనివాస్ (40), హనుమంతు (40), వెంకట్రాములు (48)గా గుర్తించారు. వీరిని ఓ ప్రైవేటు ఏజెన్సీ మ్యాన్ హోల్స్ నిర్వహణ కోసం కార్మికులుగా పెట్టుకుంది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా విధులు నిర్వర్తించడం వల్లనే వారు మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు పోలీసులు ఆ ప్రైవేటు ఏజెన్సీపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుగుతోంది.