వేసవిలో బయటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మనం అతి వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి. శరీర ఉష్ణోగ్రత సమంగా మెయింటెన్ కావాలంటే చలువ చేసే ఈ పదార్థాలను తప్పక తినండి. అవేంటంటే...
summer foods: వేసవి కాలంలో ఎక్కువగా ఏదో ఒకటి చల్ల చల్లగా తినాలని, తాగాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే చల్లగా ఉండే పదార్థాలను కాకుండా శరీరానికి చలువ చేసే పదార్థాలను తినడం ఆవశ్యకం. అయితే వేసవిలో(Summer) ఏఏ పదార్థాలను తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుందనే విషయంపై మనకు అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సలాడ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కర్భూజ, పుచ్చకాయల్లాంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను సలాడ్లుగా చేసుకుని తినొచ్చు. అలాగే ఈ కాలంలో ముఖ్యంగా పెసర మొలకలతో చేసిన సలాడ్‌లో పెరుగు కలుపుకుని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కావాలనుకుంటే పైన కాస్త ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం పిండుకుని టేస్టీగా తినేయవచ్చు. అలాగే బూడిద గుమ్మడి జ్యూస్ తాగడం వల్ల ఈ సీజన్లో శరీరానికి ఎంతో మంచిది. దీనికి చలువ చేసే లక్షణం ఉంటుంది. నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల మనం హైడ్రేటెడ్‌గా ఉంటాం.
మన పేగుల ఆరోగ్యం బాగుంటే వేసవిలో శరీర ఉష్ణోగ్రత(temperature) సరిగ్గా మెయింటెన్ అవడానికి సహకరిస్తుంది. ఇందుకు పెరుగన్నం ఎంతో సహకరిస్తుంది. దీనిలో ఉండే ప్రోబయోటిక్స్ వల్ల శరీర జీర్ణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. చలువ చేసి మన శరీర ఉష్ణోగ్రత కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే మజ్జిగ తాగడం వల్లా ప్రయోజనం ఉంటుంది. కావాలనుకుంటే మజ్జిగలో పుదీనా, కరివేపాకు, ఉప్పు లాంటివి చల్లుకుని తాగొచ్చు.