Nominations In Ap : ఆంధ్రప్రదేశ్లో మే నెలలో లోక్ సభ ఎన్నికలతో పాటు, రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో మొదటిదైన నామినేషన్లు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రచారంలో సీరియస్గా పాల్గొంటున్న పార్టీలు, అభ్యర్థులు రేపటి నుంచి నామినేషన్ల ఘట్టంలో పాల్గొనబోతున్నారు.
సార్వత్రిక ఎన్నికలు నాలుగో విడతలో భాగంగా ఏపీలోని 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 18న నామినేషన్ల (Nominations) ప్రక్రియ ప్రారంభమై 25వ తేదీన ముగియనుంది. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, 29వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు కేంద్ర ఎన్నికల సంఘం గడువు విధించింది.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అధికార వైసీపీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించేశాయి. ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందన్న దానిలోనూ క్లారిటీ వచ్చేసింది. దీంతో ఆ పార్టీలకు చెందిన నేతలు బస్సు యాత్రలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ సైతం షురూ కానుంది.