Overboiling Tea : జాగ్రత్తండోయ్! టీని పదే పదే వేడి చేసి తాగుతున్నారా?
కొంత మంది టీని చాలా ఎక్కువ సేపు మరిగించి తాగుతుంటారు. మరి కొందరు టీని ఎక్కువ మొత్తంలో ఒక్కసారే పెట్టేస్తుంటారు. కావాల్సి వచ్చినప్పుడల్లా మళ్లీ మళ్లీ దాన్ని వేడిచేసి తాగుతుంటారు. ఇవి రెండూ ప్రమాదకరమే.. ఎందుకంటే?
Overboiling Tea : కొంత మందికి టీ ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. ప్రతి అరగంటకోసారి టీ తాగుతుంటారు. అలాంటి వారు అస్తమానూ టీ పెట్టుకునే పని లేకుండా ఒక్కసారే కాచేస్తారు. తర్వాత కావాల్సి వచ్చినప్పుడల్లా దాన్ని వేడి చేసుకుని తాగుతుంటారు. మరి కొందరేమో టీ(TEA) ఎక్కువ సేపే మరిగితేనే రుచి వస్తుందని అనుకుంటారు. చాలా ఎక్కువ సేపు దాన్ని మరిగిస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ రెండు విధాలుగానూ టీని మరిగించడం వల్ల మన ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
టీల్లో చాలా రకాలు ఉంటాయి. గ్రీన్ టీ, లెమన్ టీ లాంటివి కాకుండా పాలు, డికాక్షన్‌తో చేసే టీని(MILK TEA) తాగేందుకు అంతా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ ఇలా పాలు పోసి తయారు చేసే టీని ఎక్కువ సేపు మరిగించడం(OVER BOILING) వల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఎందుకంటే? టీలో టానిన్లు అనే సమ్మేళనాలు ఉంటాయి. అలాగే పండ్లు, నట్స్లాంటి వాటిలో ఉండే పాలీ ఫెనోలిక్ బయోమాలిక్యుల్స్ ఇందులోనూ ఉంటాయి. ఇవి మనం తిన్న ఆహారంలోని ప్రొటీన్లు, మినరళ్లు, పిండి పదార్థాలు లాంటి వాటిని కుళ్లిపోకుండా శరీరం ఉపయోగించుకునేలా చేస్తాయి.
అయితే నాలుగైదు నిమిషాలకు మించి ఎక్కువగా టీని మరిగించి తాగడం వల్ల ఇలా మంచి చేసే పాలీ ఫెనోలిక్ బయోమాలిక్యుల్స్ లాంటివి కోల్పోతాయి. అలాగే శరీరం ఐరన్‌ను శోషించుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. క్యాన్సర్ కారణ కణాల ఉత్పత్తి పెరుగుతుంది. టీని ఎక్కువ సేపు మరిగించడం వల్ల రుచి తగ్గి పోవడమే కాకుండా కాల్షియం, విటమిన్ బీ 12, విటమిన్ సీ లాంటివి తగ్గిపోతాయి.