Upasana Konidela : రామ్‌చరణ్, ఉపాసన దంపతులు ఎక్కడున్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంటారు. రామ్‌చరణ్ కు నీడలా ఉంటున్నందుకు తానెంతో గర్వ పడుతున్నా అని ఆయన భార్య ఉపాసన కొనిదెల అన్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ దంపతులు ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్య్వూ ఇచ్చారు. అందులో వారిద్దరూ కూడా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
రామ్ చరణ్ గురించి ఉపాసన(Upasana) మాట్లాడుతూ… ‘మాది, రామ్ చరణ్ వాళ్లది పూర్తిగా భిన్నమైన కుటుంబ నేపథ్యాలు. వివాహం కాగానే నాకు వేరే ప్రపంచానికి వచ్చినట్లుగా అనిపించింది. ఇప్పుడు రామ్‌కు నీడలా ఉంటున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. మేమిద్దరం ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. బిడ్డని కనాలని అనుకున్నప్పుడే క్లీంకారకు జన్మనిచ్చాం. నేను స్త్రీ ప్రపంచం అని భావించే వాతావరణంలో పుట్టాను’ అంటూ చెప్పకొచ్చారు.
ఇక ఉపాసన గురించి రామ్ చరణ్(Ram Charan) మాట్లాడుతూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. తన భార్యగా ఉండటం వల్లే ఉపాసనకు గుర్తింపు రాలేదని అన్నారు. ఆమె చేసే ఎన్నో మంచి పనులు ఆమెను ఈ స్థాయిలో ఉంచాయని అన్నారు. ఆమె కుటుంబ విలువలను గౌరవిస్తూనే పలు రంగాల్లో తనదైన ముద్ర వేసుకుందని చెప్పారు. ఇటీవల వీరిద్దరూ అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో తళుక్కుమన్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఉపాసన స్పందించారు. అంబానీల ఆతిథ్యం సాటిలేనిదన్నారు. ఆ కుటుంబానికి మనస్పూర్తిగా అభినందులు తెలుపుతున్నానని అన్నారు.