మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్.. ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఇటీవలె స్క్రిప్టు రాయడం స్టార్ట్ చేశారు. దాంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో ఖచ్చితంగా చెప్పలేం. కానీ రోజు రోజుకి ఈ సినిమా పై వస్తున్న హైప్ చూసి.. ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోతోంది. మిగతా హీరోల ఫ్యాన్స్ అయితే.. ఇదేం హైప్రా బాబు.. అంటూ మహేష్ ఫ్యాన్స్‌ను అడుగుతున్నారు. రాజమౌళి నోటి నుంచి SSMB 29 గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా.. సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. చెప్పిందే చెప్పినా కూడా మహేష్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా జక్కన్న చేసిన కొన్ని కామెంట్స్ సెన్సేషనల్ అవుతున్నాయి. మరోసారి మహేష్ బాబుతో ఓ గ్లోబల్ అడ్వెంచర్ సినిమా చేయనున్నానని చెప్పుకొచ్చాడు జక్కన్న. అంతేకాదు.. ఇది పదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్ అని.. కానీ ఫైనల్‌గా ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో చేయబోతున్నామని తెలిపారు. అలాగే ఈ చిత్రం కోసం ఓ హాలీవుడ్ టీమ్‌ని హైర్ చేసుకున్నామని.. వాళ్లు వరల్డ్ వైడ్ సినిమా దగ్గర మంచి పట్టు ఉన్న వాళ్ళని.. ప్రస్తుతం వారితో వర్క్ చేస్తున్నట్టు తెలిపాడు జక్కన్న. దాంతో #SSMB29ని ట్రెండ్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. వాస్తవానికైతే.. రాజమౌళి ఇప్పుడు చెప్పాడని కాదు గానీ.. మహేష్‌తో సినిమా చేయడానికి చాలా రోజులుగా ట్రై చేస్తున్నాడు. కానీ ఎందుకో వర్కౌట్ కావడం లేదు. అయితే ఎట్టకేలకు ఇప్పుడా సమయం రానే వచ్చేసింది. పైగా ఆర్ఆర్ఆర్ మూవీతో వచ్చిన క్రేజ్‌తో మహేష్ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.