తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తనకు చాలా ఇష్టమని రామ్ పోతినేని చెప్పాడు. ఆయన సినిమాలన్నీ చూసేవాడినని, రజినీ ‘బాషా’ సినిమా అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపాడు. ఆ సినిమా 100వ రోజు కూడా టికెట్స్ దొరకలేదని, చివరి నిమిషంలో రెండు దొరికితే తాను, తన ఫ్రెండ్ వెళ్లామని పేర్కొన్నాడు. థియేటర్లో అభిమానులు ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకోవడం చూసి షాకయ్యానని చెప్పాడు.
నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. అయితే పాన్ ఇండియా భాషలతో పాటు అవధీ భాషలో కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏ తెలుగు సినిమా ఇప్పటివరకు రిలీజ్ చేయని ఈ భాషలో విడుదలయ్యే ఏకైక మూవీగా ఇది రికార్డు సృష్టించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ భాషను ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మాట్లాడుతారు.
నటి భాగ్యశ్రీ బోర్సేతో డేటింగ్‌లో ఉన్నట్లు వస్తోన్న రూమర్స్‌పై రామ్ పోతినేని స్పందించాడు. ‘ఈ సినిమా కోసం నేను ఒక లవ్ సాంగ్ రాసినప్పటి నుంచి ఈ రూమర్స్ ప్రారంభమయ్యాయి. మనసులో ఏం లేకపోతే అంత మంచిగా ఎలా రాస్తారు అని చాలామంది అనుకున్నారు. కానీ, ఈ సినిమాలోని హీరో హీరోయిన్ పాత్రలను ఊహించుకుని లిరిక్స్ రాశాను. అప్పటికి హీరోయిన్‌ను ఎంపిక చేయలేదు’ అని తెలిపాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘వారణాసి’. తాజాగా ఈ సినిమా కోసం నటీనటులు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాజమౌళి రూ.200కోట్లు, మహేష్ రూ.120కోట్ల నుంచి రూ.150కోట్ల వరకు, ప్రియాంక చోప్రా రూ.32కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్ రూ.16కోట్లు, M.M కీరవాణి రూ.12కోట్లు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర మరణం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆయన నటించిన చివరి చిత్రం ఏంటంటూ చర్చించుకుంటున్నారు. ధర్మేంద్ర చివరి సినిమా ‘ఇక్కిస్’. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేయగా.. క్షణాల్లో అది వైరల్ అయింది. ఈ మూవీలో ఆయన అమర సైనికుడికి తండ్రిగా శక్తివంతమైన పాత్ర పోషించారు. DEC 25న ఇది విడుదల కానుంది.
చిన్న సినిమాగా రిలీజైన రియల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీ మూవీ ‘రాజు వెడ్స్ రాంబాయి’ మంచి హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఇప్పటివరకు ఈ మూవీ రూ.9.08 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు.
లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘తలైవార్ 173’ మూవీ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి దర్శకుడు సుందర్ సి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీకి దర్శకుడిగా పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్‌ను మేకర్స్ ఎంపిక చేశారట. 2026 మార్చి నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించిన సినిమా ‘శంబాల’. డిసెంబర్ 25న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా OTT, శాటిలైట్ పార్ట్‌నర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను ఆహా రూ.5 కోట్లకు, శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానల్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఈ చిత్రం ఇప్పట్లో OTTలోకి రాదని స్పష్టం చేశాడు. ఈ సినిమాను 50 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని పేర్కొన్నాడు. ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రంలో అఖిల్, తేజస్వి జంటగా నటించారు.
కేవలం రూ. 50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఓ చిన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ‘లాలో- కృష్ణ సదా సహాయతే’ అనే గుజరాతీ చిత్రం ఇప్పటికే రూ.80 కోట్లకు పైగా వసూళ్లతో రూ.100 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది. కథలో బలం ఉంటే చిన్న సినిమా అయినా సరే భారీ కలెక్షన్లు సాధించవచ్చని ఈ చిత్రం మరోసారి నిరూపించింది.
నీరజ కోన దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ‘తెలుసు కదా’ చిత్రం కథ తనదే అంటూ ఓ యువకుడు SMలో కొన్ని సాక్ష్యాలను బయటపెడ్డాడు. 2020లో సమంతకు తాను స్టోరీ చెప్పినట్లు అతడు తెలిపాడు. ఆ కథను సమంత తన స్నేహితురాలు నీరజ కోనకు చెప్పడంతో, ఆమె కథలో చిన్న మార్పులు చేసి ఈ సినిమా తిసినట్లు పేర్కొన్నాడు. కథలను ఇతరులకు చెప్పే ముందు జాగ్రత్తగా అంటూ సూచించాడు.
➛ ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్.➛ 1960లో సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన ఆయన 300లకు పైగా చిత్రాలలో నటించారు.➛ ‘షోలే’ చిత్రంతో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.➛ 2004లో రాజస్థాన్‌లోని బికనీర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.➛ 2012లో పద్మభూషణ్, 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య అవార్డును అందుకున్నారు.
రామ్ చరణ్ నటిస్తోన్న ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి’ పాట యూట్యూబ్‌లో రికార్డులను సృష్టిస్తోంది. ఈ సాంగ్ ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇక ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. కాగా, ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.
నవంబర్ చివరి వారంలో సినీ ప్రేక్షకులను అలరించేందుకు 5 మూవీలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 27న రామ్ పోతినేని ‘ఆంధ్రా కింగ్ తాలుకా’, ధనుష్ ‘అమర కావ్యం’ విడుదల కానున్నాయి. అలాగే 28న రాయ్ లక్ష్మీ ‘జనతాబార్’తోపాటు స్కూల్ లైఫ్, మరువ తరమా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవే కాక 28న మహేష్ ‘బిజినెస్‌మేన్’ కూడా రీరిలీజ్ కానుంది.
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర నివాసానికి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. దీంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భద్రత పెంచారు. కాగా, గత కొంతకాలంగా ధర్మేంద్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.