»Kerala Story In Controversy One Crore Reward If Proved
Kerala Story: వివాదంలో ‘కేరళ స్టోరీ’.. నిరూపిస్తే కోటి బహుమతి!
బాలీవుడ్లో వచ్చిన కశ్మీర్ ఫైల్స్ సినిమా సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో జరిగిన అరాచకాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారని.. ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. అదే రేంజ్లో వివాదాలు కూడా ఈ సినిమాను ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు కూడా ఓ సినిమా గురించి ఇదే రేంజ్లో రచ్చ జరుగుతోంది. అసలు కేరళ స్టోరీ ఎందుకు వివాదం అవుతోంది?
సినిమాలకు వివాదాలు కొత్త కాదు.. కానీ ఈ సారి మాత్రం ఓ సినిమా చుట్టూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. అందుకే ప్రస్తుతం ఆ సినిమా గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మళయాళంలో తెరకెక్కిన కేరళ స్టోరీ అనే సినిమానే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మే 5న ‘ది కేరళ స్టోరీ’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. కేరళలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అదా శర్మ లీడ్ రోల్లో నటించిన కేరళ స్టోరీ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వ వహించారు.
ఈ సినిమా ట్రైలర్లో కేరళ రాష్ట్రానికి చెందిన 32,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని, ఆ తర్వాత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లో చేరారని చూపించారు. ట్రైలర్ కాదు.. అనధికార లెక్కల ప్రకారం కేరళలో ముప్పై ఐదు వేలకు పైగానే అమ్మాయిలు, మహిళలు మతమార్పిడిలో టెర్రరిజం వైపు ఆకర్షితులయ్యారని ఒక రిపోర్ట్ ఉంది. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగానే ఈ సినిమాను రూపొందించారు. దాంతో ఒక్కసారిగా ‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది.
ఈ చిత్రానికి కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్ నుండి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సినిమా ప్రదర్శనను నిషేధించాలని అక్కడి నాయకులు పిలుపునిస్తున్నారు. అంతేకాదు.. ‘ది కేరళ స్టోరీ’ మద్దతుదారులకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) యువజన విభాగం అయిన ముస్లిం యూత్ లీగ్ ఒక సవాల్‌ను కూడా విసిరింది. సినిమాలో చూపించినట్టుగా.. జరిగినట్టుగా నిరూపిస్తే.. కోటి రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. దాంతో ఈ సినిమా పై రోజు రోజుకి వివాదం మరింతగా ముదురుతోంది. మరి ఫైనల్‌గా ఈ సినిమా రిలీజ్ అవుతుందా? అయిన తర్వాత ఇంకెన్ని వివాదాలు చుట్టుముడతాయో చూడాలి.