నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ కార్యక్రమానికి ఇటీవల పవన్ కళ్యాణ్ రావడం చర్చనీయాంశంగా మారింది. బాలయ్య బాబు తెలుగుదేశం పార్టీ నాయకుడు. పవన్ జనసేన పార్టీ అధ్యక్షులు. ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో కీలకంగా ఉన్నాయి. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేస్తాయనేందుకు ఇది సంకేతంగా వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. చంద్రబాబుతో తిరిగిన జనసేనాని, ఇప్పుడు ఆయన బావమరిది బాలయ్యతో తిరుగుతున్నారని, ఇందులో తప్పేముందని అధికార పార్టీ విమర్శలు గుప్పించింది. చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న పార్టీలను పోగుచేసేందుకు ఈ కార్యక్రమాన్ని బాలకృష్ణ ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. అయితే ఈ ఓటీటీ ప్రోగ్రాంకు పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర రాజకీయ ప్రముఖులకు కూడా పిలుపు వచ్చింది.
ఇందులో భాగంగా ఏపీ మంత్రి రోజాకు కూడా పిలుపు వచ్చిందట. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా చెప్పారు. తనకు కూడా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ నుండి తనకు ఎప్పుడో ఆహ్వానం అందిందని, కానీ ఇంకా తానే వెళ్లలేదన్నారు. అసలు విషయానికి వస్తే సినిమా వేరు, రాజకీయాలు వేరు అని, బాలకృష్ణ గారు కూడా అదే చెప్పారన్నారు. తాను ఎక్కడ కలిసినా బాలయ్య బాబు బాగా మాట్లాడుతారని, నందమూరి కుటుంబంతోనే తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. పార్టీ మారినందుకు నేనే కాస్త ఇబ్బందిగా ఉంటున్నానని, కానీ వారు రాజకీయాలు వేరు, ఇవి వేరు అని చెబుతారన్నారు.
అందుకే తనకు ఓకే అయితే చేద్దామని బాలకృష్ణ చెప్పారని, కానీ దానిని కాంట్రోవర్సీ చేసి, జగన్ గారి వద్ద వ్యతిరేకంగా చెప్పేవారు ఉంటారని, నెగిటివ్‌గా తీసుకుంటే ఇబ్బంది అవుతుందనే భయంతోనే తాను చేయలేదన్నారు. లేదంటే తనకు ఇబ్బంది లేదన్నారు. తాను మంత్రిగా ఉన్నానని, అయితే వెళ్లవద్దనేది తన నిర్ణయం మాత్రమేనని, పన్నెండేళ్లుగా చూస్తున్నానని జగన్ వెళ్లవద్దని ఆంక్షలు విధించరన్నారు. తన మీద కంప్లైంట్స్ ఇచ్చినా ఆయన తనను ఏమీ అనలేదన్నారు.